ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని..రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతామని ప్రకటించిన వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అవినీతి జరిగిన ప్రతి అంశంపై ఆయన దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా, అవసరం లేకున్నా...ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి బ్రేక్ వేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) కార్యాలయంలో గత ప్రభుత్వ హయాంలో సిఫార్సులతో అవసరానికి మించి నియమించిన 42 మంది సిబ్బందిని తొలగించాలని నిర్ణయించారు.
నిబంధనలకు విరుద్ధంగా..తమకు నచ్చిన వారికి అందలం ఎక్కించడంలో భాగంగా చంద్రబాబు అనేక దొడ్డిదారి నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోఅర్హులకు ఎందరికో అన్యాయం జరిగింది. దానిని సరిదిద్దే క్రమంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక అధికారులను మార్చిన వైసీపీ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. సీఎంఆర్ఎఫ్‌లోని ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై దృష్టి సారించింది. 42 మంది అక్రమ నియామకం అయిన వారిపై వేటు వేశారు. దీనికి సంబంధించి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మెమో విడుదల చేశారు.
కాగా, పలువురు అధికారులను సైతం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ స్థానంలో విజిలెన్స్ డీజీగా ఉన్న గౌతమ్ సవాంగ్‌ను నియమించింది. దీంతో పాటు సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శిగా ధనంజయరెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శిగా సోల్మన్ ఆరోఖ్యరాజ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా రావత్, సీఎం ఓఎస్డీగా కృష్ణమోహన్ రెడ్డిని నియమించింది. క్షేత్రస్థాయిలోనూ అక్రమ నియామకాలను తొలగించాలనే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు.