ఎడిటోరియల్ : పాపం....వంగవీటి ఎలా అయిపోయాడో ?
జగన్మోహన్ రెడ్డిని
అధికారంలోకి రానీయనని ఎన్నికలకు ముందు శపథం
చేశాడు. రాష్ట్రమంతా పర్యటించి వైసిపికి
వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పాడు.
తీరా చూస్తే ఎన్నికలైపోయాయి. ఫలితాలూ వచ్చేశాయి. కానీ భీకర శపథాలు చేసిన వంగవీటి
రాధాకృష్ణ మాత్రం ఎక్కడా అడ్రస్ కనబడటం లేదు. తనను తాను ఎక్కువగా ఊహించుకుని
రెంటికి చెడ్డ రేవడి అయిపోయాడు పాపం.
ఇక్కడ సమస్య ఏమిటంటే తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాలు చేయటం తప్ప తనకంటూ సొంతంగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నించలేదు. ఏ పార్టీలో ఏ పదవి ఇచ్చినా ఏనాడూ న్యాయం చేయలేదు. మొన్నటికి మొన్న ఎన్నికలకు ముందు వైసిపిలో యువజన అధ్యక్షునిగా ఉన్నాడు. అధ్యక్షునిగా అయితే ఉన్నాడు కానీ ఏనాడు పది రోజులు కూడా రాష్ట్రంలో తిరిగింది లేదు. ఒకవైపు పార్టీని అధికారంలోకి తేవటానికి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే రాధా మాత్రం ఎక్కడా కనబడలేదు.
రాధా గురించి మైనస్ మార్కులు చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాయి. విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో గెలవడన్న కారణంతోనే విజయవాడ తూర్పు కానీ లేకపోతే మచిలీపట్నం ఎంపి గా కానీ పోటీ చేయమని జగన్ చెబితే వినలేదు. సెంట్రల్ నియోజకవర్గం కోసం పట్టుబట్టి చివరకు వైసిపికి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. పోనీ టిడిపిలో అయినా సెంట్రల్ టికెట్ దక్కిందా అంటే అదీ లేదు.
పోనీ జగన్ ను సిఎం కానీయనని, వైసిపిని అధికారంలోకి రానీయనంటూ చేసిన శపథాన్ని నిలబెట్టుకున్నారా అంటే అదీలేదు. వైసిపిని అధికారంలోకి రానీయనంటూ చెప్పిన రాధా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలి కదా ? కాపు సామాజికవర్గాలతో సమావేశాలు పెట్టి వైసిపికి వ్యతిరేకంగా ఓట్లు వేయించాలి కదా ? ఏమీ చేయలేదు. కేవలం ఓ స్టేట్మెంట్ ఇచ్చి కూర్చున్నారు.
సరే జగన్ ను అడ్డుకునే శక్తి చంద్రబాబుకే లేకపోయిన తర్వాత రాధా ఎంత ? మొత్తానికి ఫలితాలు వచ్చి వారం అవుతున్నా ఇంత వరకూ వంగవీటి రాధా అడ్రస్ లేకుండా పోయారట. తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటే పరిస్ధితి ఇలాగే ఉంటుంది మరి.