గెలిస్తే తనవల్లే గెలిచిందంటారు ఓడిపోతే ఎందుకు ఓడిపోయారో చెప్పరు: చంద్రబాబు తీరు

చతురంగ బలాలు మొహరించి దివి భువిని ఏకం చేసి ఎత్తులు పైయెత్తులు వ్యూహాలపై వ్యుహాలు పన్నారు, కూడని అక్రమ పొత్తులు పెట్టుకున్నారు. జీవితకాలంలో ఊహించలేని ఊహకందని కాంబినేషణ్ తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు – అదీ జరిగి పోయింది. ఏపి నుండి జన ప్రవాహం, ధన ప్రవాహం – ప్రచారం మిన్నంటింది. చివరకు ఆంధ్రా ఆక్టోపస్ కూడా తప్పుడు సర్వె – ఎక్జిట్ పోల్ రిజల్ట్స్ ప్రకటించింది. అశ్వత్థామ హతః-నరుడు కాదు కుంజరః  తీరులో మొత్తం కపట, మయోపాయ, కుట్రపూరిత మహాసంగ్రామం జరిగింది.

ఇంతా జరిగినా, పరువు పూర్తిగా కోల్పోయినా ప్రతిష్టకు చిమ్మ చీకట్లు కమ్మినా అసలు తెలంగాణలో ఎందుకు ఓడిపోయారో?  చెప్పని సమర సార్వభౌముడు చంద్రబాబు నాయుడు. కనీసం తెలంగాణాలో తమ పొత్తు డిశాస్టర్ అయినా చర్చకు కూడా పూనుకోలేక పోతున్న సందర్భంలో కూడా ఉత్తరాదిలో మాత్రం తన వల్లే కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందని చంద్రబాబు చెప్పడం దౌర్భాగ్యమని వైసిపి ఏపి రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్యా ప్రసాద్‌ రెడ్డి అన్నారు.

శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా కోసం ఎవరితోనైనా కలిసి ఉంటామని చెప్పారే తప్ప, చంద్రబాబులా పూటకో మాటమార్చే స్వభావం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డిది కాదని పేర్కొన్నారు. తనకు గిట్టని వారినందరినీ జగన్‌మోహనరెడ్డితో ముడిపెడుతూ చంద్రబాబు నాయుడు తన ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చుకుంటున్నారని విమర్శించారు. 

జగన్‌మోహనరెడ్డి ఒక పద్ధతి ప్రకారం, దివంగత మహానేత వైఎస్సార్‌ లాగా హుందాగా నడచు కుంటారని తెలిపారు. విశాఖ ప్రజల దాహార్తిని తీర్చడానికి టీడీపీ, బీజేపీలు ఎటువంటి కార్యాచరణ రూపొందించలేదని ప్రసాద్‌ రెడ్డి విమర్శించారు. 

అబద్ధాలు చెప్పడంలో, నిమషానికోసారి నాలుక మడతెయ్యటంలో చంద్రబాబును మించిన వారు ప్రపంచంలో మరోకరు లేరని - ఆయన అబద్ధాలకు తెలంగాణ ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కనీసం ప్రతిపక్షంలో కూర్చోవడానికి కూడా వీల్లేకుండా తెలంగాణ ప్రజ బుద్ధి చెప్పిందని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: