ఎడిటోరియల్ : ఆ సెంటిమెంట్ చంద్రబాబునూ దెబ్బ కొడుతుందా ?
చంద్రబాబునాయుడుకు సంబంధించి తాజాగా ఓ సెంటిమెంటు రాజకీయాల్లో
చక్కర్లు కొడుతోంది. ఈ మధ్యనే సిబిఐ విచారణకు చంద్రబాబు నో ఎంట్రో బోర్డు
పెట్టేశారు గుర్తుందా ? ఇపుడా అంశంపైనే ఓ సెంటిమెంటు సోషల్ మీడియాలో కూడా బాగా
వైరల్ గా మారింది. ఇంతకీ ఆ సెంటిమెంటు ఏమిటంటే ? సిబిఐకి నో చెప్పిన కొంతమంది
ముఖ్యమంత్రులు తర్వాత జరిగిన ఎన్నికల్లో పదవిని పోగొట్టుకున్నారట. అంతేకాకుండా
వారందరిపైనా సిబిఐ కేసులు నమోదు చేసి విచారణ జరిపి అరెస్టులు కూడా చేసిందట. అందుకు
ఉదాహరణగా నలుగురు ముఖ్యమంత్రుల చరిత్ర కూడా చక్కర్లు కొడుతోంది.
అవినీతి వ్యవహారాల్లో కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో కానీ కేంద్ర దర్యాప్తు సంస్ధల విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని చంద్రబాబు భయపడుతున్నారు. ఆ విషయాన్ని చంద్రబాబే స్వయంగా ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పారు. చంద్రబాబు ఆందోళనను బట్టి సిబిఐ విచారణ జరుగుతుందేమోనని పార్టీ నేతలతో పాటు జనాలు కూడా అనుమానించటం మొదలుపెట్టారు. జగన్ హత్యాయత్నం ఘటనపై హై కోర్టులో విచారణ స్పీడ్ అందుకుంటున్న సమయానికి చంద్రబాబు హఠాత్తుగా సిబిఐ విచారణకు నో ఎంట్రి అంటూ ఓ జీవో కూడా రిలీజ్ చేశారు.
సిబిఐ విచారణను అడ్డుకోవటంలో చంద్రబాబే మొదటి వ్యక్తి కాదట. గతంలో నలుగురు ముఖ్యమంత్రులు సిబిఐని ఎంట్రీని వారి రాష్ట్రాల్లో అడ్డుకుంటూ జీవోలు తెచ్చారు. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్నాటక, బీహార్ రాష్ట్రాల సిఎంలు జీవోలు తెచ్చినట్లు చరిత్ర చెబుతోంది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా వీరభద్రసింగ్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. సిబిఐ విచారణ ఎక్కడ జరుగుతుందో అన్న భయంతో సిబిఐని అడ్డుకుంటూ జీవో తెచ్చారు. అయితే కోర్టు జోక్యంతో జీవో వీగిపోయింది. ఇంకేముంది ? సిబిఐ విచారణ జరిగి సిఎం అరెస్టయ్యారు.
తర్వాత జార్ఖండ్ సిఎం మధు కోడా పరిస్ధితి కూడా అంతే. స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచి అనూహ్యంగా సిఎం అయ్యారు. తర్వాత అత్యంత అవినీతిపరుడిగా అపఖ్యాతి మూటకట్టుకున్నారు. తనపై ఆరోపణలు పెరిగిపోవటంతో ముందుజాగ్రత్తగా సిబిఐ విచారణను అడ్డుకున్నారు. అయితే, కోడా ఉత్తర్వులను ఢిల్లీ కోర్టు అడ్డుకుని సిబిఐ విచారణకు ఆదేశించింది. దాంతో విచారణలోనే కోడా అరెస్టవ్వక తప్పలేదు. ఇక లాలూ ప్రసాద్ యాదవ్ సంగతి చెప్పనే అక్కర్లేదు. బీహార్ సిఎంగా ఉండగా గడ్డి దాణా కేసులో ఇరుక్కున్నారు. వాస్తవాలు బయటకు రాకుండా సిబిఐ విచారణను అడ్డుకున్నారు. సుప్రింకోర్టు జోక్యంతో జీవో వీగిపోయింది. విచారణ జరిగి లాలూ అరెస్టు అయ్యారు.
కర్నాటక ముఖ్యమంత్రిగా ఉండగా యడ్యూరప్పకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. గాలి జనార్ధన రెడ్డి అవినీతిని అడ్డుకోలేకపోయారు. ఆరోపణలపై లోక్ అదాలత్ విచారణ జరిపి సిబిఐ విచారణకు ఆదేశించింది. అయితే, సిబిఐ విచారణను యడ్యూరప్ప అడ్డుకున్నారు. అయితే, హైకోర్టు జీవోను కొట్టేసి సిబిఐ విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత యడ్యూరప్ప జైలుకు వెళ్ళక తప్పలేదు. పై ముఖ్యమంత్రుల విషయంలో కామన్ గా కనబడే విషయం ఒకటుంది. అదేమిటంటే, సిబిఐ ఎంట్రీని అడ్డుకున్న తర్వాత వచ్చిన ఎన్నికల్లో అందరూ ఓడిపోయారు. మరి అదే సెంటిమెంటు ఏపికి కూడా వర్తిస్తుందా ? లేకపోతే తిరగబడుతుందా అన్నది చూడాలి.