జమ్ము కశ్మీర్ డ్రామా : బీజేపీది ఎంత ముందు చూపో...!?

Vasishta

జమ్ము కశ్మీర్ లో పీడీపీ – బీజేపీ ప్రభుత్వం కుప్పకూలింది. పీడీపీతో పొత్తు నుంచి వైదొలుగుతున్నట్టు బీజేపీ ప్రకటించింది. దీంతో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వెంటనే రాజీనామా చేశారు. దీంతో మూడేళ్లపాటు కొనసాగిన పీడీపీ – బీజేపీ మైత్రికి ఫుల్ స్టాప్ పడింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడం తదుపరి ప్రభుత్వం ఏర్పాటవుతుందా.. రాష్ట్రపతి పాలన అమలు చేస్తారా.. అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.


          సైద్ధాంతిక విభేదాలున్నా అధికారమే పరమావధిగా భావించి జమ్ము కశ్మీర్ లో పీడీపీ, బీజేపీలు ఒక్కటయ్యాయి. 2014 చివర్లో ఎన్నికలు జరిగినా 2015 వరకూ ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే ఆ తర్వాత బీజేపీ – పీడీపీలు సంయుక్తంగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. రెండు పార్టీల మధ్య అవగాహన కుదరడంతో పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించారు. 2015 మార్చి 1 న ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన అకాల మరణంతో కొంతకాలంపాటు గవర్నర్ పాలన సాగింది. అనంతరం పీడీపీ – బీజేపీలు మళ్లీ అవగాహనకు రావడంతో మెహబూబా ముఫ్తీ 2016 ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.


మెహబూబా ముఫ్తీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏదో అంశంపై రెండు పార్టీల మధ్య ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అయితే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగారు. అయితే కొంతకాలంగా జమ్ముకాశ్మీర్ లో శాంతిభద్రతలు క్షీణించాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉగ్రమూకలు చెలరేగిపోతున్నాయి. యధేచ్ఛగా పౌరులపైన, పోలీసులపైన దాడులకు తెగబడుతున్నాయి. గత మూడేళ్లలో 2వేల మందికి పైగా పౌరులు, పదుల సంఖ్యల పోలీసులు మృతి చెందారని సమాచారం. ఈ నేపథ్యంలో రంజాన్ సందర్భంగా ప్రకటించిన కాల్పుల విరమణపై రెండు పార్టీల మధ్య తలెత్తిన విభేదాలు ఇప్పుడు కటీఫ్ దాకా వెళ్లాయి. కాల్పుల విరమణను కంటిన్యూ చేయాలని పీడీపీ డిమాండ్ చేయగా, అది కుదరదని బీజేపీ తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో ప్రభుత్వం నుంచి వైదొలిగేందుకే బీజేపీ నిర్ణయం తీసుకుంది. శాంతిభద్రతలు క్షీణించాయని, అందుకే వైదొలుగుతున్నామని బీజేపీ ప్రకటించింది. గవర్నర్ పాలన విధించాలని డిమాండ్ చేసింది.


బీజేపీ వైదొలుగుతున్నట్టు ప్రకటించగానే ముఖ్యమంత్రి పదవికి ముఫ్తీ రాజీనామా చేశారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి పనిచేశామని ముఫ్తీ చెప్పారు. పాక్ తో చర్చల పునరుద్ధరణ జరగాలని తాము కోరుకున్నామన్నారు. శాంతి స్థాపన కోసమే కాల్పుల విరమణ కొనసాగించాలని చెప్పామని ముఫ్తీ స్పష్టం చేశారు. మరోవైపు.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. గవర్నర్ నరీందర్ నాథ్ ఓహ్రాను కలిసి ఆయన ఈ మేరకు సూచించారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేనందున వెంటనే ఈ నిర్ణయం తీసుకోవాలన్నారు


జమ్ముకాశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 87 స్థానాలుండగా పీడీపీకి 28, బీజేపీకి 25, నేషనల్ కాన్ఫరెన్స్ కు 15, కాంగ్రెస్ కు 12, ఇతరులకు 7 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 44 మంది సభ్యుల బలం అవసరం. రెండు పార్టీలు కలిస్తే తప్ప ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదు. పీడీపీ, కాంగ్రెస్ లు కలిసినా మెజారిటీ కష్టమే. అలాంటి సమయంలో కచ్చితంగా ఇతరుల మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముందుచూపుతోనే బీజేపీ బయటికొచ్చిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి పాలన విధించి తద్వారా తమ ఆధిపత్యం ఉండేలా ఆలోచిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: