ఆనంకు చంద్రబాబు అంత ద్రోహం చేశారా...!?

Vasishta

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఆనం కుటుంబం మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమైందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరేందుకు ఆనం కుటుంబం సిద్ధమందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఔనని కానీ, కాదని కానీ ఆనం కుటుంబం ఖండించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.


ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లాలో కీలక నేతలు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రామనారాయణ రెడ్డి మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజనానంతర పరిణామాల్లో వారిద్దరూ టీడీపీలో చేరారు. అయితే తెలుగుదేశం పార్టీలో తమకు తగిన గౌరవం దక్కడం లేదని కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్సీ స్థానం ఇస్తానన్న చంద్రబాబు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారనే ఆవేదన ఆ కుటుంబీకుల్లో ఉంది.


కొంతకాలంగా ఆనం వివేకానంద రెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిపాలయ్యారు. ఆయన్ను పరామర్శించడానికి సీఎం చంద్రబాబు, లోకేశ్ వెళ్లి వచ్చారు. ఆ సమయంలో రామనారాయణ రెడ్డి హైదరాబాద్ లోనే ఉన్నా ఆసుపత్రికి వెళ్లలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నారని, పార్టీ మారడం ఖాయమనే సంకేతాలు కనిపించాయి. ఇంతలో నెల్లూరులోని వారి కార్యాలయంలో చంద్రబాబు ఫోటో కనిపించకుండా పేపర్లు అతికించడంతో పార్టీ మారబోతున్నారని అందరూ నిర్ధారణకు వచ్చారు. అయితే కాసేపటికో ఆ పేపర్లను తొలగించడంతో వారి ఆలోచన ఏంటో అర్థంకాక అనుచరులు తలలు పట్టుకుంటురన్నారు.


అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వివేకానందరెడ్డిని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పరామర్శించారు. ఈ సమయంలో రామనారాయణ రెడ్డితో సమావేశమయ్యారు. దీంతో ఆనం కుటుంబం పార్టీ మారడం ఖాయమనే నిర్ధారణకు వచ్చారు. అయితే.. ఆనం కుటుంబం పార్టీ మారుతోందన్న వార్తలను టీడీపీ ఖండించింది. ఆనం కుటుంబం పార్టీ మారే ఛాన్సే లేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.  ఆనం కుటుంబం పార్టీ మారుతుందా లేదా అనే దానిపై నెల్లూరు జిల్లాలో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఆ ఫ్యామిలీ మాత్రం ఈ విషయంపై స్పందించేందుకు ముందుకు రాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: