ధర్మ నిర్ణయం – ఇరకాటంలో ప్రభుత్వం

అధర్మానికి పాల్పడి అపవాదు పాలైన మంత్రి ధర్మానప్రసాదరావు చివరకో ధర్మ నిర్ణయం తీసుకున్నారు. అదే మంత్రిపదవికి రాజీనామా. ఈనిర్ణయం ప్రభుత్వాన్ని,సహచర మంత్రులను ఇరకాటంలో పడవేసింది. పార్థసారథికి శిక్ష ఖరారైనా కూడా మంత్రిపదవిని వీడలేదు. పైగా శిక్ష రద్దుకోసం ప్రయత్నించి విఫలమైనా సరే పదవిని పట్టుకుని పాకులాడుతున్నారు. ఇలాంటి సమయంలో చార్జిషీట్ లో పేరున్నందుకే నైతిక భాద్యత వహించి మంత్రి పదవిని వదులుకోవడం మిగిలిన మంత్రులందరి పదవులకు ముప్పుతెచ్చి పెట్టింది. రాష్ట్ర సర్కారుకు సైతం ఇది సమస్యను సృష్టించింది. జీఓల జారీ కేసుల్లోనే ఇంకా నలుగురు క్యాబినెట్ మినిష్టర్లున్నారు. రేపోమాపో సిబిఐ దాఖలు చేయనున్న మిగతా చార్జిషీట్ల లో వీరి పేర్లు నిందితులుగా నమోదుకానున్నాయి. పైగా ఇప్పటికే వీరు జారిచేసిన జీఓలు అక్రమమని నిర్దారించి సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారిచేసింది. అంటే ఇష్టంలేకున్నా ప్రజల్లో తలెత్తుకోవాలంటే ధర్మాన బాటలో నడువకు తప్పదు. అంటే ఈనలుగురు కూడా రాజీనామాలు చేస్తే,ఇంకేం ఉంది అవినీతి ఊబిలో ఇరుక్కుని సగం క్యాబినెట్ ఖాలీ అన్నమాట. ఇప్పటికే మోపిదేవి,పార్థసారథికైతే తప్పని సరి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వీరికి తోడుగా సబితాఇంద్రారెడ్డి,గీతారెడ్డి,పొన్నాల లక్ష్మయ్య,కన్నా లక్ష్మినారాయణలు కూడా రాజీనామాలు చేస్తే మొత్తం 12 మంది కీలక క్యాబినెట్ లో ఆరుగురు పోయినట్టే. అంటే సగం క్యాబినెట్ అవినీతి ఊబి అంటుకుని పోతుండగా, రాష్ట్రంలో జరుగుతున్న ఏసిబి,ఇడి,సిబిఐ లమిగిలిన కేసుల్లో లోతుగా ఇరుక్కోక పోయినా అపవాదు పాలయ్యే అవకాశాలున్న మరికొందరు మంత్రులున్నారు. దీంతో మొత్తం ప్రభుత్వం నైతిక భాద్యత వహించాల్సి పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. అలా కాకపోయినా కూడా ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నవారంతా నిర్దోషులుగా తిరిగి వస్తామని, అప్పుడే మంత్రి పదవిలో హుందాగా కొనసాగుతామని అంటున్నారు.అంటే ఈ పదవుల్లో కొత్తవారిని కూర్చోబెట్టలేక, ఉన్నవారికే అదనపు భాద్యతలు ఇవ్వాల్సి వస్తుంది.కాని ఇదికూడా కష్టమే, ఏకంగా సగం క్యాబినెట్ ను ఇంచార్జీలతో నడుపలేరు. ఇలా ఏరకంగా చూసినా ధర్మాన తీసుకున్న ధర్మ నిర్ణయం సహచర మంత్రులను, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: