చిరంజీవి బర్త్ డే స్పెషల్ : వెండితెర విజేత.. రాజకీయ పరాజిత..!

Vasishta

చిరంజీవి ... పేరు వినగానే మెగాస్టార్ అనే పేరే గుర్తొస్తుంది. అదీ ఆయనకు వెండితెరతో ఉన్న సంబంధం. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా మెగాస్టార్ బిరుదు కొనసాగింది.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందుకే రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుని విఫలమైన చిరంజీవి మళ్లీ తన పూర్వాశ్రమమైన సినిమాల్లోకే వెళ్లిపోయారు. 150వ సినిమాను ఇటీవలే పూర్తి చేసుకున్న చిరంజీవి 151వ సినిమాకు క్లాప్ కొట్టుకున్నారు. ఇవాళ ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన పొలిటికల్ ప్రస్తానాన్ని ఓసారి తెలుసుకుందాం.


          చిరంజీవి .. ఎవరు అవున్నా కాదన్నా ఇదొక బ్రాండ్.! ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా ఆ రంగంలోకి ప్రవేశించి అంచలంచెలుగా ఎదిగి నేడు మెగాస్టార్ అనిపించుకుంటున్నారు. ప్రస్తుత జనరేషన్ హీరోలందరికీ ఆయన నిలువెత్తు స్ఫూర్తి. 1955 ఆగస్టు 22న చిరంజీవి జన్మించారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల అంజనమ్మ, వెంకట్రావ్ దంపతులకు శివ శంకర వర ప్రసాద్ జన్మించారు. అనంతరం సిల్వర్ స్క్రీన్ ఆయనకు చిరంజీవి అని పేరు పెట్టుకుంది.


          పునాదిరాళ్లు చిరంజీవి తొలి సినిమా.. నాటి నుంచి నేటి ఖైదీ నెంబర్ 150 వరకూ చిరంజీవి సినీ జీవితంలో ఎన్నో మలుపులు.. మరుపురాని గుర్తులు..! చిరంజీవి సినీ జీవితంలో ఆరంభంలో కాస్త ఒడిదుడుకులు ఎదురైనా ఆ తర్వాత వెనుదిరిగి చూస్కోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆయన సినీ సేవలకుగానూ భారత ప్రభుత్వం పద్మభూషణ్ తో సత్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం 3 నందులతో దీవించింది. 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి. ఇవికాకుండా మరెన్నో సత్కారాలు.. పురస్కారాలు..!


          సినిమారంగంలో అప్రతిహతంగా సాగిన ఆయన ప్రస్తానం రాజకీయజీవితంలో మాత్రం అర్ధాంతరంగా ముగిసిందని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నా ఆ ఫీల్డ్ కు చిరంజీవి పనికిరారేమో అనుకునేవాళ్లే ఎక్కువ. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. 2008 ఆగస్టు 26న చిరంజీవి తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీని ప్రకటించారు. ప్రేమే లక్ష్యం – సేవే మార్గం అనేది పీఆర్పీ నినాదం. సామాజిక సేవ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు చిరంజీవి చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా సామాజిక న్యాయం జరగట్లేదని.. తాము అధికారంలోకి వస్తే అది చేసి చూపిస్తామని చిరంజీవి ప్రకటించారు.


          2009 ఎన్నికల్లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 294 స్థానాల్లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసింది. అయితే కేవలం 18 శాతం ఓట్లు సాధించి 18 సీట్లను మాత్రమే సాధించింది. సాక్షాత్తూ సొంతూరున్న పాలకొల్లులోనే చిరంజీవి ఘోరంగా ఓడిపోయారు. తిరుపతిలో గెలవడంతో ఆయన ఊపిరి పీల్చుకోవాల్సి వచ్చింది. లేకుంటే ఘోర అవమానాన్ని భరించాల్సి వచ్చేది. అయితే నాటి వై.ఎస్. సర్కార్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడంలో మాత్రం చిరంజీవి సక్సెస్ అయ్యారు. దీంతో వై.ఎస్. రెండోసారి అధికారంలోకి వచ్చారు.


          ఏదో సాధించాలని పార్టీ పెడితే ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడం, ఎన్నికల తర్వాత పార్టీని నడిపే సత్తా, వ్యూహం లేకపోవడంతో చిరంజీవి పట్టు కోల్పోయారు. ఇక దీన్ని ఏమాత్రం నడిపే శక్తి లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేశారు. 2011 ఫిబ్రవరి 6న చిరంజీవి ప్రజారాజ్యం జెండా పీకేసి కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. దీంతో ప్రజారాజ్యంపై హోప్స్ పెట్టుకున్న ఎంతో మంది నేతలు హతాశులయ్యారు.


           వెండితెరపై ఓ వెలుగు వెలిగిన చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారంటే మరో ఎన్టీఆర్ లాగా రాణిస్తారని, ఆయన కూడా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెడతారని భావించారు. ఆ ఉద్దేశంతోనే చిరంజీవిని నమ్మి ఎంతోమంది బడాబడా నేతలు ప్రజారాజ్యంలో చేరారు. కానీ వారి ఆశలను ఫుల్ ఫిల్ చేయడంలో చిరంజీవి విఫలమయ్యారు. అయినా చిరంజీవి మాత్రం తెలుగు ప్రజలకు ఎప్పుడూ మెగాస్టారే.! రాజకీయాల్లో విఫలమైనా సినిమారంగంలో ఆయన ఎప్పటికీ మృగరాజే..! పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: