కొనసాగుతున్న పోలింగ్

 హైదరాబాద్: చిన్న చిన్న సమస్యలు మినహాయించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ ప్రారంభం కావడంతోనే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కేంద్రాల వద్దకు బారులు తీరారు. ఓటును వేసేందుకు ఉత్సాహాన్ని చూపెడుతున్నారు. రాష్ర్టంలోని 18 అసెంబ్లీ స్థానాలకు, నెల్లూరు పార్లమెంటు స్థానానికి ఈ రోజు ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అక్కడక్కడ ఈవీఎంలు మొదట్లో కొంత మొరాయించడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిని సరిచేసి అధికారులు కొంత ఆలస్యమైన పోలింగ్ ను ప్రారంభించారు. పోలింగ్ కు సంబంధించి ఎన్నికల సంఘానికి కొన్ని ఫిర్యాదులు కూడా అందాయి. తాము ఓ గుర్తుకు ఓటు వేద్దామనుకుంటే ఈవీఎం మిషన్లో మరో గుర్తు వద్ద లైట్ వెలుగుతుందనీ ఓటర్లు ఫిర్యాదు చేశారు. తిరుపతిలో ఓ పార్టీకి చెందిన నకిలీ ఈవీఎంలను ప్రదర్శించారనే వార్తలొచ్చాయి. ఆళ్గడ్డలో కాంగ్రెస్-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఏజెంట్ల మధ్యన కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. అదే విధంగా వివిధ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా చిన్న చిన్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. మొత్తానికి పోలింగ్ మాత్రం ప్రశాంతంగానే జరుగుతోంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అయితే, పోలింగ్ కేంద్రాలకు 5గంటల లోపు వచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రాత్రి ఎంత వరకైనా టైంను కేటాయించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: