నేడు ఉప సమరం

 హైదరాబాద్: నేటి ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనున్నది. ఈ పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను చేసింది. రాష్ర్టంలోని 12 జిల్లాలోని 18అసెంబ్లీ స్థానాలకు, నెల్లూరు పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 46లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 5వేల పై చిలుకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఎన్నికల నిర్వహాణ కోసం 50వేల మంది వరకు సిబ్బందిని ఎన్నికల కమిషన్ వాడుకుంటోంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సకల సన్నాహాలు చేపట్టినట్లు ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఎన్నికలు జరిగే చోట సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా అన్ని ముందస్తు చర్యలను చేపట్టామని వారంటున్నారు. రాష్ర్టంలోని అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు పరీక్షగా చెప్పొచ్చు. సర్వశక్తులొడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు నేతలు. అయితే, ఈ పరీక్షలో ఎవరు పాసవుతారో, ఎవరు ఫెయిలవుతారో అంతా ఓటరన్న చేతిలోనే వుంది. డబ్బే డబ్బు... గతంలో ఎన్నడూ జరగని విధంగా జరుగుతున్న ఈ ఉప ఎన్నికలు రాష్ర్టంలోని అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారింది. ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలోనే అత్యంతమైన ఖరీదైన ఎన్నికలుగా అటు మీడియా, ఇటు పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా అన్ని కట్టుదిట్టమైన పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ చెబుతోంది. కానీ, దీనికి విరుద్దంగా మునుపెన్నడూ లేని విధంగా ఈ ఉప ఎన్నికల్లో 40కోట్ల రూపాయల నగదును, 12కోట్ల రూపాయల విలువ చేసే బంగారు, వెండి అభరణాలను, కాటన్ల కొద్దీ మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. దీన్ని బట్టి ఈ ఎన్నికల్లో డబ్బులు ఎంతగా విచ్చల విడిగా ఖర్చు పెడుతున్నారో వేరే చెప్పనక్కర్లేదు. ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ మారు డబ్బులతో పాటు ‘ముక్కు పుడక’లను కూడా ఇస్తున్నట్లు తేలింది. అంతే కాదు, తమకు ఓటు వేయకున్నా సరే, ప్రత్యర్ధులకు ఓటు వేయకుండా ఉండేందుకు కూడా డబ్బులు ఇస్తుండటం గమనార్హం. నిఘానా...అదెక్కడా... ఓటుకు నోటుపై గట్టి నిఘా పెట్టినట్లు ఎన్నికల కమిషన్ చంకలు గుద్దుకుంటోంది. వారి నిఘా నేత్రాలకు అందకుండా ఆయా పార్టీల అభ్యర్థులు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు పట్టుబడిన నగదు కట్టలు, వెండి,బంగారు అభరణాలు, మద్యం బాటిళ్ల కాటన్లు చెప్పకనే చెబుతున్నాయి. ఎటు చూసినా డబ్బే డబ్బు అగుపిస్తోంది. పట్టుబడుతున్న డబ్బే కోట్లలో ఉంటే ఇంకెంత డబ్బు ఎన్నికల నిఘాకు కనిపించకుండా నేగటు దారి మళ్లించారో వేరే చెప్పనక్కర్లేదు. కోట్లాది రూపాయల నగదు, బంగారు, వెండి అభరణాలు, మద్యం బాటిళ్లను పట్టుకున్నట్లు చెబుతున్న ఎన్నికల అధికారులు ఆ డబ్బంత ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తెచ్చారు?అనే దానిపై ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేకపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా ఇంత మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్న దాఖలాలు లేవు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అక్రమంగా పట్టుబడిన డబ్బు అక్షరాల 38కోట్లే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: