వైఎస్ జగన్.. రాష్ట్రంలోనే యువ నాయకుడు.. అతి చిన్న వయసులోనే ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. అన్నికలిసొస్తే అతి పిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిపోదామని కలలు కంటున్నాడు. ఐతే.. వైఎస్ జగన్ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాడంటే అందుకు కారణం ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న ఛరిష్మాయే కారణమన్న సంగతి అందరికీ తెలిసిందే.
అందుకే జగన్ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని ఎప్పుడూ ప్రజలకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఏకంగా తన పార్టీ జెండాలోనే తండ్రి ఫోటో పెట్టేసుకున్నాడు. తన సొంత పేపర్, టీవీ ఛానళ్లలో ఇప్పటికీ వైఎస్ రాజశేఖరరెడ్డి సూక్తులు దర్శనమిస్తుంటాయి. జయంతి, వర్థంతి రోజుల్లో వైఎస్సార్ ఆర్టికల్స్ తో నింపేస్తుంటారు. మరి అలాంటి వైఎస్సార్ ఫోటోను వైసీపీ జెండా నుంచి తొలగిస్తారా..
ఈ డిమాండ్ చేస్తున్నది ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. ఆయన గతంలో వైఎస్ హయాంలో మంత్రిగా ఉన్నవారే. మరి ఇప్పుడు ఇంత హఠాత్తుగా ఆ డైలాగ్ ఎందుకు కొట్టారంటే.. అందుకు కారణం జగన్ ఇటీవల ఎంతో కష్టపడి.. ఎంతో కాలం వెయిట్ చేసి మోడీ అపాయిట్ మెంట్ తెచ్చుకుని ఢిల్లీ వెళ్లి కలవడమే. అంతే కాక.. తాము బీజేపీ వెంటే ఉన్నామని నిస్సంకోచంగా చెప్పడమే.
భారతీయ జనతాపార్టీతో సంబంధాలు పెట్టుకోవడంలో జగన్ తీరు అశ్చర్యపరుస్తుందని, మూడేళ్లుగా భాజపాతో అనుకూలంగానే ఉన్నామని ప్రకటించడం విడ్డూరమని రఘువీరారెడ్డి మండిపడ్డారు. రాజశేఖరరెడ్డి బ్రతికున్నంతవరకూ బిజెపీతో పోరాడేవారని, అలాంటి ఆయన పేరు చెప్పుకొని పెట్టిన పార్టి ఇప్పుడు బీజెపీకి వంతు పలకడం బాధాకరమని అన్నారు రఘువీరా. వైసీపీ బ్యానర్లో రాజశేఖరరెడ్డి ఫోటో తొలగించాలని డిమాండ్ చేశారు.