చంద్రబాబును చెడుగుడు ఆడుకున్న కేసీఆర్ టీ న్యూస్...!

Chakravarthi Kalyan
ఔను.. టీ న్యూస్ చంద్రబాబుపై నెగిటివ్ కథనం వచ్చి చాలా రోజులైంది. ఇద్దరు చంద్రుల మధ్య కుదిరిన రహస్య రాజీ వల్లనో.. లేక ఒకరి జోలి మనకెందుకు అన్న విజ్ఞతో అర్థం కాదు కానీ.. ఇటీవలి కాలంలో చంద్రబాబుపైనా, టీడీపీ పైనా కేసీఆర్ సొంత ఛానెల్ టీ న్యూస్ లో నెగిటివ్ కథనాలు అంతగా రావడం లేదు.  బహుశా ఆ ఛానల్ కూడా తమ అధినేత పాలసీనే పాటిస్తుండొచ్చు. 


కానీ.. ఇన్నాళ్లకు మళ్లీ టీ న్యూస్ కు చంద్రబాబు పై నెగిటివ్ కథనం వేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న అమరావతి లో ఆంధ్రా అసెంబ్లీ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు చేసిన ప్రసంగం కారణంగానే మళ్లీ టీ న్యూస్ కు ఆ పరిస్థితి వచ్చింది. ఆ సభలో చంద్రబాబు ఎప్పటిలాగానే అడ్డగోలుగా విభజించారు.. అంటూ పాడిందే పాటరా చందాన మళ్లీ సేమ్ రికార్డు వేసుకున్నాడు. 


కాకపోతే.. ఈసారి కాస్త డోసు పెరిగింది. విభజన సమయంలో నా గుండె రగిలిపోయింది. చెప్పలేనంత బాధ.. పట్టరానంత ఆవేశం.. నేను జీవితంలో అంత బాధను ఎప్పుడూ అనుభవించలేదు. కసి.. తపన.. ఆక్రోశం.. అంటూ తెగ బాధపడిపోయారు. ఆ రోజు తెలుగు జాతికి ఘోరమైన అవమానం జరిగింది. మనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. మన మాట ఏమాత్రం పట్టించుకోలేదు.. అంటూ విభజన రోజులు గుర్తు చేసుకున్నారు. 


సహజంగానే చంద్రబాబు మాటలు తెలంగాణ నేతలకు కోపం తెప్పించాయి. తమ 60 ఏళ్ల కల సాకారమైన రోజును పట్టుకుని తెలుగుజాతికి ఘోరమైన అవమానం జరిగింది.. అంటే ఆ తెలుగు జాతిలో తెలంగాణ లేదా.. తెలంగాణ ఆనందం మీకు కనిపించలేదా.. అని ఆగ్రహించారు. తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ కవిత, మరో ఎంపీ బాల్క సుమన్ చంద్రబాబు విషం చిమ్మారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


దీంతో టీఆర్ఎస్ సొంత ఛానెల్ టీ న్యూస్ రెచ్చిపోయింది. చంద్రబాబు అమరావతి అసెంబ్లీ ప్రసంగానికి, ఈటెల, కవిత, బాల్క సుమన్, ఓ యూ జేఏసీ నేతల మాటలను జోడించి.. విషం చిమ్మారు అనే శీర్షికతో జోరుగా ప్రసారం చేశారు. చంద్రబాబు మరోసారి తెలంగాణపై తనకు ఉన్న అక్కసు వెళ్లగక్కారని.. తెలంగాణ తెలుగు దేశం నేతలు ఇంకా ఆ పార్టీలో కొనసాగడం సిగ్గుచేటంటూ కథనాలు ప్రసారం చేశారు. ఇలా చాలా రోజుల తర్వాత మళ్లీ టీ న్యూస్ లో చంద్రబాబుపై కథనం రక్తికట్టింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: