హైదరాబాద్: టీడీపీ పార్టీ నుంచి మరో నలుగురు శాసనసభ్యులు సస్పెండ్‌కు గురయ్యారు. రాష్ర్టపతి ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి విరుద్దంగా ఓటు వేశారనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు వేణుగోపాల్ చారి, హరీశ్వర్ రెడ్డి, బాలనాగిరెడ్డి, చిన్నం రామకోటయ్య తదితరులను బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నలుగురు ఎమ్మెల్యేలను టీడీపీ బహిష్కరించగా...బహిష్కరణకు గురైన హరీశ్వర్ రెడ్డి మాత్రం తామే టీడీపీని ఏడాదిన్నర కిందట బహిష్కరించామంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. టీడీపీ అధినేత బాబు తెలంగాణకు వ్యతిరేకమనీ, తెలంగాణ వ్యతిరేక పార్టీని ప్రజలు ఎప్పుడో బహిష్కరించారనీ అన్నారు.అలాంటి వాళ్లు తనను సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.
ఇప్పటికే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని పార్టీ నుంచి బయటకు పంపించారు. అదే బాటలో మరో నలుగురిపై వేటేసింది. ఇదిలా ఉంటే టీడీపీని వరుసగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. రాష్ర్టంలో టీడీపీ పరిస్థితి కడుదయనీయంగా మారుతోంది. దెబ్బల మీద దెబ్బలు. షాక్ ల మీద షాక్ లు తగులుతుండటంతో ఉన్న క్యాడర్ కూడా కొంత నిరాశనిస్ప్రహాలకు గురౌతోంది. ఓ వైపు ప్రజలు టీడీపీని తిరస్కరిస్తున్నారు. మరోవైపు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు కూడా పార్టీకి క్రమక్రమంగా దూరమవుతున్నారు.
సీనియర్లందరూ పార్టీని వీడుతుండటంతో పార్టీ అధినేత చంద్రబాబుకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. పార్టీ నుంచి ఒకరు పోయినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదనీ పైకి చెబుతున్నప్పటికీ లోలోపల మాత్రం ఏదో తెలియని టెన్షన్ వెంటాడుతుందని చెప్పడంలో సందేహం లేదు. రాష్ర్టంలో జరిగిన ఉప ఎన్నికలన్నింటిలో టీడీపీ ఘోరపరాజయాన్ని చవిచూస్తోంది. ప్రజల తరుపున పోరాడుతున్నట్లు టీడీపీ చెబుతున్నప్పటికీ పార్టీని ప్రజలు ఆదరించడం లేదు. ఏది ఏమైనా టీడీపీ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతుందనే చెప్పాలి.
పార్టీ నుంచి మరెవరూ వెళ్లకుండా చంద్రబాబునాయుడు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, వలసల్ని మాత్రం ఆపలేకపోతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. టీడీపీని ప్రజలు ఆదరించడం లేదనీ, ఇక్కడే ఉంటే తమ రాజకీయ భవిష్యత్ లేకుండా పోతుందనే అభిప్రాయానికి వచ్చిన వారందరూ వైఎస్ఆర్, టీఆర్ఎస్ పార్టీలవైపు చూస్తున్నట్లు సమాచారం.
మరింత సమాచారం తెలుసుకోండి: