ధర్మాన “ధర్మం”గానే విధులకు హాజరయ్యరా?!

Kuthuru Raji Reddy
రాజు తలచుకుంటే ఏదైనా చేయవచ్చుననే చరిత్ర చెప్పిన సత్యాన్ని ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిరూపించుకున్నారు. ఢిల్లీ పెద్దలను కలిసిన తర్వాత సిఎం దూకుడు పెంచారు. రెండు విషయాల్లో సిఎం సక్సెస్ అయ్యానని అనిపించుకున్నారు. ఎవరేమంటే తమకేమి అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ పెద్దల అండదండలుండగా అనుకున్నారో తెలియదుగాని సమాచార కమీషనర్ల ఎంపిక విషయంలో తన పంతం నెగ్గించుకోగా మరోసారి వాన్ పిక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంత్రి ధర్మానప్రసాద్ రావు విషయంలో కూడా ముఖ్యమంత్రి తన మాటను నెగ్గించుకున్నారు. ధర్మాన ప్రసాద్ విషయం ఢిల్లీదాకా వెళ్లినప్పటికిని ధర్మాన ప్రసాద్ రావును మంత్రి వర్గం నుండి తొలగించడమా అనే విషయం రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని, సిఎం నిర్ణయానికే వదిలివేస్తున్నామని డిల్లీ పెద్దలు సూచించడంతో ముఖ్యమంత్రి ధర్మాన ప్రసాదరావును మంత్రిగా కొనసాగించడానికే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వద్ద జరిగినటువంటి ఎన్ఏసి సమావేశంలో వైస్ చైర్మన్ హోదాలో ధర్మాన ప్రసాద్ రావు విధులకు హాజరయ్యారు. ఆరునెలల తర్వాత అధికారికంగా విధులకు హాజరుకావడంతో ధర్మాన ప్రసాద్ రావు ఇకనుండి మంత్రిగా ఎటువంటి డోకా లేకుండా కొనసాగుతారనేది తేలిపోయింది. కొంత కాలం పాటు వివాదస్పద నిర్ణయాలకు దూరంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎట్లాయితే గట్లాయే, ఏడికైతే ఆడికాయే అనే చందంగా రెండు విషయాల్లో నిర్ణయాలు తీసుకున్నారు. కాగా నాలుగురోజుల క్రితం హస్తినకు పోయివచ్చిన సిఎం ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. కాగా ధర్మాన ప్రసాద్ రావు ఇన్నాళ్ల పాటు విధులకు దూరంగా ఉండగా ఇప్పుడు విధులకు హాజరుకావడంతో ధర్మం ఏపాటిదనే విషయం ఆయనకే వదిలేద్దాం. ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలు కొనసాగుతుండగానే విధులకు హాజరుకావడమనేది చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: