అమరావతి : నాదెండ్లకు షాక్ తప్పదా ?

Vijaya


క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది.  విశాల రాజకీయ ప్రయోజనాల కోసం దగ్గర వాళ్ళని బలిచ్చేయటం రాజకీయాల్లో మామూలే. ఇపుడు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్  తర్వాత అంతటి కీలకస్ధానంలో ఉన్న నాందెడ్ల మనోహర్ పరిస్ధితి అలాగే తయారవబోతోందనే ప్రచారం పెరిగిపోతోంది. టీడీపీతో పొత్తులేకపోతే నాదెండ్ల కోరుకున్న నియోజకవర్గంలో పోటీచేయవచ్చు. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానంలేదు.అయితే తెలుగుదేశంపార్టీతో పొత్తుకు పవన్ తహతహలాడిపోతున్నారు. కాబట్టి పొత్తు ధర్మంలో భాగంగా చంద్రబాబునాయుడు ఇచ్చిన సీట్లను తీసుకోవటం మినహా పవన్ కు వేరేదారిలేదు. ఈ నేపధ్యంలో ఎన్నిసీట్లలో జనసేన పోటీచేస్తుంది ? పోటీచేయబోయే సీట్లేవి ? అన్న విషయాలను పక్కనపెట్టేద్దాం. ముందుగా పొత్తుల్లో ఎగిరిపోయేది తెనాలి అసెంబ్లీ నియోజకవర్గమే అనే ప్రచారం పెరిగిపోతోంది. 2019 ఎన్నికల్లో తెనాలిలో జనసేన తరపున పోటీచేసిన నాదెండ్లకు వచ్చింది సుమారు 30 వేల ఓట్లు.ఇదే నియోజకవర్గంలో పోటీచేసిన టీడీపీ అభ్యర్ధి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు వచ్చింది 76 వేల ఓట్లు. గెలిచింది అన్నాబత్తుని శివ, రెండోస్ధానంలో ఆలపాటిని వదిలేస్తే నాదెండ్ల మూడోస్ధానంలో నిలిచారు. రేపటి ఎన్నికల్లో పొత్తుల్లో చంద్రబాబు ఎట్టిపరిస్ధితుల్లోను తెనాలి సీటును వదులుకోరనే ప్రచారం పెరిగిపోతోంది. జరుగుతున్న ప్రచారం నిజమే అయితే నాదెండ్లకు సీటు ఎగిరిపోయినట్లే. ఎందుకంటే ఈ సీటుపై ఆలపాటి చాలా గట్టిగా ఉన్నారు. 24 గంటలూ పార్టీ వ్యవహారాల్లో పక్కనే పెట్టుకుని తిరిగే నాదెండ్లకే సీటును సాధించుకోలేని పవన్ ఇక మిగిలిన వాళ్ళకోసం ఏమి పట్టుబడతారు ? అసలు ఎన్నిసీట్లు కావాలని పట్టుబడతారు ?  కాబట్టి రాబోయే సీట్ల సంఖ్య విషయంలో జనసేన నేతలు, సైనికులు పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరంలేదు. నాదెండ్ల కూడా పోటీగురించి ఆలోచించటం మానేసి ప్రచారం విషయమై దృష్టిపెడితే బాగుంటుందేమో. ఒకవేళ పవన్ పట్టుబట్టి నాదెండ్ల కోసం తెనాలి సీటును సాధించుకుంటే మాత్రం అదో అద్భుతమనే చెప్పాల్సుంటుంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: