అమరావతి : పవన్ను ఆటలో అరటిపండును చేసేశారా ?

Vijaya


జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చంద్రబాబునాయుడు ఆటలో అరటిపండు లాగ తీసిపారేస్తున్నట్లున్నారు. అవసరమైనపుడు పవన్ కు సంఘీభావం పలకటం లేదా పవనే వచ్చి చంద్రబాబుకు మద్దతు పలకటం మినహా రెండుపార్టీల మధ్య ఇంకేమి జరుగుతున్నట్లు లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనిచ్చేది లేదని పవన్ అంటారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకంకావాలని చంద్రబాబు పిలుపిస్తారు. అంతేకానీ పొత్తుల గురించి, సీట్ల షేరింగ్ గురించి ఇంతవరకు రెండుపార్టీల నుండి అధికారికంగా ఉమ్మడి ప్రకటన వచ్చిందే లేదు.పైగా విచిత్రం ఏమిటంటే పవన్ తో సంబంధాలు లేకుండానే చంద్రబాబు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేస్తున్నారు. పాదయాత్రలో కొందరు అభ్యర్ధులను లోకేష్ కూడా ప్రకటించేశారు. అయితే అంతర్గతంగా ఏమైందో ఏమో మహానాడులో మాట్లాడుతు తాను చేసిన  అభ్యర్ధుల ప్రకటనంతా తూచ్ అనేశారు లోకేష్. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే తాజాగా జరిగిన మహానాడులో పార్టీ తరపున మొదటి విడత మ్యానిఫెస్టోను చంద్రబాబు ప్రకటించారు. తొందరలో మరిన్ని మ్యానిఫెస్టోలు ప్రకటించబోతున్నట్లు చెప్పారు.జనసేనతో పొత్తుపెట్టుకోబోతున్నపుడు మిత్రపక్షం అభిప్రాయాలు తీసుకోవాలని చంద్రబాబుకు అనిపించలేదా ? పొత్తుపెట్టుకోబోతున్న పార్టీలు కలిసి కదా ఉమ్మడి మ్యానిఫెస్టోను రిలీజ్ చేయాల్సింది. మ్యానిఫెస్టో రిలీజ్ విషయంలో తమపార్టీ నేతలు కసరత్తు చేస్తున్నట్లు పవన్ గతంలో ప్రకటించారు. ఇపుడు చంద్రబాబు మొదటివిడత ప్రకటించేశారు. అంటే మ్యానిఫెస్టో రూపకల్పనలో పవన్ను సంప్రదించాల్సిన అవసరంలేదని చంద్రబాబు డిసైడ్ అయినట్లే ఉంది.పొత్తులుపెట్టుకోవాలని అనుకుంటున్న పార్టీలు రేపటి ఎన్నికల్లో ఎవరి మ్యానిఫెస్టోను వాళ్ళే ప్రకటించుకుంటారా ? ఒకవైపు అభ్యర్ధులను, మరోవైపు మ్యానిఫెస్టోను చంద్రబాబు ప్రకటించేస్తుంటే పవన్ చూస్తూ కూర్చున్నారంతే. చంద్రబాబే అభ్యర్ధులను, మ్యానిఫెస్టోను ప్రకటించేసిన తర్వాత ఇక జనసేనతో  పొత్తేమిటి ? పొత్తులుపెట్టుకుంటున్నాయంటే పార్టీలన్నీ కలిసి సీట్ల సంఖ్య, నియోజకవర్గాలను ఫైనల్ చేసుకోవాలి. అన్నీ పార్టీల నేతలు కలిసి చర్చించుకుని ఉమ్మడి మ్యానిఫెస్టోను ప్రకటిస్తే అది పర్ఫెక్ట్ పొత్తవుతుంది. జరుగుతున్నది చూస్తుంటే  పవన్ను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పెద్దగా లెక్కలోకి తీసుకుంటున్నట్లు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: