అమరావతి : వివేకా హంతకుడిని కూతురు రక్షిస్తోందా ?

Vijaya


తండ్రి వివేకానందరెడ్డి హత్యకేసులో కూతురు సునీత వ్యవహారం మొదటినుండి అనుమానాస్పదంగానే ఉంది. ఒక్కోసారి ఒక్కోమాట మారుస్తున్నారు. దాంతో హత్యకేసులో ఆమె పాత్రపైనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ అనుమానాలకు తాజాగా జరిగిన ఒక ఘటనే ఉదాహరణగా నిలిచింది. ఇంతకీ విషయం ఏమిటంటే వివేకాను గొడ్డలితో హత్యచేసింది దస్తగిరి. ఈ విషయాన్ని సీబీఐ విచారణలోను, కోర్టులో కూడా స్వయంగా దస్తగిరే అంగీకరించాడు. తాను గొడ్డలితో ఎలా నరికిచంపాననే విషయాన్ని కూడా వివరించాడు.



అలాంటి దస్తగిరిని సీబీఐ అప్రూవర్ గా ఫ్రీగా వదిలేసింది. హంతకుడు ఇచ్చిన సాక్ష్యం ఆధారంగానే కొందరు నిందితులను సీబీఐ అరెస్టుచేసింది.  అప్రూవర్ గా దస్తగిరి చాలాకాలంగా బెయిల్ మీద బయటతిరిగేస్తున్నారు. అనుమానం పేరుతో సీబీఐ మరికొందరిని విచారించి అరెస్టుచేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణపేరుతో వెంటాడుతోంది. సరే ఈ విషయాలన్నింటినీ పక్కనపెట్టేస్తే దస్తగిరి బెయిల్ ను రద్దుచేయాలని వివేకాకు పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి సుప్రింకోర్టులో పిటీషన్ వేశారు.



అయితే కృష్ణారెడ్డి పిటీషన్ ను కొట్టేయాలని వివేకా కూతురు సునీత ఇంప్లీడ్ పిటీషన్ వేయటమే ఆశ్చర్యంగా ఉంది. కృష్ణారెడ్డి పిటీషన్ను కొట్టేయాలని సునీత అడగటం అంటే దస్తగిరి బెయిల్ ను రద్దుచేయాల్సిన అవసరం లేదని చెప్పటమే. ఎందుకంటే ఈ కేసులో కృష్ణారెడ్డి బాధితుడు కాడట. బాధితులకు మాత్రమే బెయిల్ రద్దు పిటీషన్ వేసే అర్హతుందని ఆమె చెప్పారు.



ఎవరైనా హంతకుడికి శిక్షపడాలని కోరుకుంటారు. తన తండ్రి హంతకులకు శిక్షలు పడేంతవరకు తాను పోరాటం చేస్తుంటానని సునీత చాలాసార్లు చెప్పింది. మరలాంటిది తన కళ్ళెదురుగానే దస్తగిరి తిరిగేస్తుంటే ఆమె ఏమీ మాట్లాడటంలేదు. నిజానికి దస్తగిరి బెయిల్ రద్దుచేయాలని కోరాల్సింది సునీతే. కానీ సునీత అలా చేయలేదు. చేయకపోగా పీఏ వేసిన బెయిల్ పిటీషన్ రద్దును కొట్టేయమని ఈమె కేసు వేయటమే అనుమానాలను పెంచేస్తోంది. హంతకుడిని రక్షించటానికి ఆమె ప్రయత్నిస్తుండటమే విచిత్రంగా ఉంది. హంతకుడి బెయిల్ రద్దయితే సునీతకు వచ్చే నష్టమేమిటో అర్ధంకావటంలేదు. సునీత వ్యవహారం చూస్తుంటే అందరికీ ఆమె మీదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి కోర్టు ఏమిచేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: