రాయలసీమ : ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోయిందా ? అఖిలతో కష్టమేనా ?

Vijaya


మాజీమంత్రి భూమా అఖిలప్రియలో ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోయినట్లుంది. పార్టీలో గొడవలు, పార్టీ నాయకత్వం పట్టించుకోకపోవటం, రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడటం లాంటి అనేక కారణాలతో అఖిలలో ఫ్రస్ట్రేషన్ రోజురోజుకు పెరిగిపోతోంది. దాని పర్యవసానమే ఏవీ సుబ్బారెడ్డితో పాటు ఆయన మద్దతుదారులపై అఖిల మద్దతుదారుల దాడి. ఏవీపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచినందుకు కారణమని అఖిల మీద పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేశారు. హత్యాయత్నం కేసు నమోదుచేయటమే కాకుండా బుధవారం తెల్లవారి అదుపులోకి కూడా తీసుకున్నారు. కోర్టు  అఖిల, భర్త భార్గవ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదే సమయంలో అఖిలకు టీడీపీ షోకాజ్ నోటీసు జారీచేసింది. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని చెప్పింది. ఇక్కడ విషయం ఏమిటంటే కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో దాదాపు 8 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను చంద్రబాబునాయుడు ఫైనల్ చేసేశారు. ఆళ్ళగడ్డలో పోటీచేయాలని అనుకుంటున్న అఖిల విషయాన్ని పెండింగ్ లో పెట్టారు. ఆళ్ళగడ్డలో కాకపోయినా నంద్యాలలో అయినా టికెట్ ఇవ్వమంటే ఈ విషయాన్ని కూడా తేల్చలేదు. అఖిల మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే చంద్రబాబు, లోకేష్ అవకాశం కూడా ఇవ్వటంలేదు. ఇదే సమయంలో జిల్లా పార్టీలో సీనియర్ నేతలెవరూ మాజీమంత్రి తో మాట్లాడటంలేదు. పార్టీ ఆఫీసుకు వచ్చినా ఎవరూ పట్టించుకోవటంలేదు. అఖిలకు టికెట్ ఇచ్చినా సమస్యే ఇవ్వకపోయినా సమస్యే అన్నట్లుగా తయారైంది వ్యవహారం.ఒంటెత్తుపోకడల వల్ల, దూకుడు స్వభావం వల్ల మద్దతుదారులు కూడా ఆమెకు దూరమైపోయారు. ఇదే సమయంలో అఖిలతో పాటు ఆమె భర్త భార్గవరామ్, తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి మీద హత్యాయత్నం, భూకబ్జాలు, చీటింగ్, ఫోర్జరీ, కిడ్నాపింగ్ లాంటి కేసులు నమోదయ్యాయి.  ఒక కేసులో అఖిల అరెస్టయి బెయిల్ మీద బయటున్నారు. అప్పటినుండి పార్టీ ఆమెను దూరం పెట్టేసింది. దాంతో పై రెండు నియోజకవర్గాల్లో టికెట్ కోసం అఖిలకు ఇతర నేతలనుండి  పోటీ పెరిగిపోయింది.ఈ నేపధ్యంలో యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ నంద్యాలలోకి అడుగుపెట్టారు. తన టికెట్ విషయాన్ని తేల్చుకునేందుకు లోకేష్ క్యాంపు దగ్గరకు అఖిల చేరుకున్నారు. అఖిల అక్కడ ఉండగానే సీనియర్ నేత ఏవీ కూడా వచ్చారు. దాంతో మండిపోయిన అఖిల తన మద్దతుదారులతో దాడులు చేయించారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. తన మద్దతుదారులు ప్రత్యర్ధులపై దాడులు చేస్తుంటే అక్కడే ఉన్న అఖిల ఎవరినీ వారించలేదు. మరీ ఘటనను చంద్రబాబు ఎలా తీసుకుంటారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: