హైదరాబాద్ : టీడీపీకి ఎన్టీయార్ అంత చీపైపోయారా ?

Vijaya



ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం చివరకు తెలుగుదేశంపార్టీకి ఒక జోక్ గా మారిపోయింది. హైదరాబాద్ లో జరిగిన మినీమహానాడులో ఎన్టీయార్ కు భారతరత్న ఇచ్చి తీరాల్సిందే అని తమ్ముళ్ళు తీర్మానం చేశారు. ఇదే విషయమై ఎన్టీయార్ కొడుకు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతు ఎన్టీయార్ కు భారతరత్న ఎందుకివ్వరని కేంద్రాన్ని నిలదీయటమే విచిత్రంగా ఉంది. భారతరత్న పురస్కారం అందుకోవటానికి ఎన్టీయార్ కు మించిన వాళు ఎవరున్నారని అడగటమే ఆశ్చర్యమేసింది.



ఇపుడు కాదు ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని చాలాకాలంగా డిమాండు వినిపిస్తునే ఉంది. ఈ డిమాండు టీడీపీ అధికారంలో ఉన్నపుడు కాకుండా  ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రమే వినిపిస్తుంటుంది. చంద్రబాబునాయుడు వైఖరి కూడా చాలా విచిత్రం. ఎందుకంటే అధికారంలో ఉన్నపుడు ఎప్పుడూ ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదు. 2014-18 మధ్య ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నపుడు కూడా చంద్రబాబు ఈ డిమాండ్ వినిపించలేదు.



జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పానని చెప్పుకున్న రోజుల్లో కూడా ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం ఇప్పించాలని చంద్రబాబు అనుకోలేదు. అలాంటిది ప్రతిపక్షంలోకి రాగానే చంద్రబాబుకు అర్జంటుగా భారతరత్న పురస్కారం గుర్తుకొచ్చేస్తుంది. చంద్రబాబు సంగతి సరే ఇపుడు బీజేపీలోనే ఎన్టీయార్ కూతురు దగ్గుబాటి పురందేశ్వరి యాక్టివ్ గా ఉన్నారు కదా మరి ఆమైనా ఎందుకని తండ్రికి పురస్కారం ఇప్పించలేకపోతున్నారు ? అతికష్టంమీద ఎన్టీయార్ బొమ్మతో వందరూపాయల కాయిన్ ను రిలీజ్ చేయించగలిగారంతే.



ఇదే విషయమై ఎన్టీయార్ భార్య లక్ష్మీపార్వతి మాట్లాడుతు చంద్రబాబుకే కాదు కుటుంబంలో ఎవరికీ ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం ఇప్పించటం ఇష్టంలేదన్నారు. ఎందుకంటే ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం ప్రకటిస్తే దాన్ని భార్య హోదాలో తాను తీసుకోవటం వీళ్ళల్లో ఎవరికీ ఇష్టంలేదని ఆమె చెప్పారు. అందుకనే కంటితుడుపు చర్యగా అభిమానుల కోసం మాత్రమే ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటారని ఆమె అసలు విషయం చెప్పేశారు. చూస్తుంటే లక్ష్మీపార్వతి చెప్పిన కారణం నిజమే అనిపిస్తోంది. 






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: