అమరావతి : జోరుగా ‘కాపు’ రాజకీయం

Vijaya


రాష్ట్ర రాజకీయమంతా జోరుగా కాపుల చుట్టే తిరుగుతోంది. వచ్చేఎన్నికల్లో కాపు సామాజికవర్గాన్ని తెలుగుదేశంపార్టీ వైపు వెళ్ళకుండా అడ్డుకోవటమే టార్గెట్ గా వైసీపీ పావులు కదుపుతోంది. నిజానికి కాపులు ఏ ఒక్కపార్టీతోనే మమేకమైలేరు. వివిధ పార్టీలు తమకిచ్చే ప్రధాన్యత ప్రకారమే కాపునేతలు అయా పార్టీల్లో ఉన్నారు. బీసీల్లాగ మొత్తం లేదా మెజారిటి సామాజికర్గం ఒకే పార్టీతో ఉన్నట్లు కాపులు ఎప్పుడూ లేరు. ఇందుకే హోల్ సేల్ గా  రాబోయే ఎన్నికల్లో కాపులను తమవైపుకు తిప్పుకోవాలని చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు.



ఇందులో భాగంగానే జనసేనతో పొత్తు పెట్టుకోవాలని వ్యూహం చేస్తుండటం. రెండుపార్టీల మధ్య పొత్తు దాదాపు ఖాయమే అయినా ఇద్దరు ప్రకటిస్తేనే అధికారికమవుతుంది. పవన్ తో చేతులు కలపటం ద్వారా కాపుల ఓట్లన్నీ టీడీపీకి పడాలని చంద్రబాబు అనుకుంటున్నారు. వచ్చేఎన్నికల్లో గెలుపు చంద్రబాబుతో పాటు పవన్ కు కూడా చాలా కీలకమైపోయింది. వచ్చేఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డే గెలిస్తే టీడీపీ ఉంటుందో లేదో తెలీదు కానీ జనసేన మాత్రం అనుమానమే.



స్వయంగా కాపు సామాజికవర్గంకు చెందిన వ్యక్తే కాబట్టి పవన్ ద్వారా చంద్రబాబు కాపుల ఓట్లు రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో పవన్, చంద్రబాబులోని నెగిటివ్ షేడ్ చూపించి కాపులను అటువైపు మళ్ళకుండా కాపు సామాజికవర్గంలోని మంత్రులు, ఎంఎల్ఏలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తుని రైలు దహనం కేసులో కాపులపై అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కేసులు నమోదుచేస్తే ఇప్పటి జగన్ ప్రభుత్వం ఎత్తేసిన విషయాన్ని మంత్రులు అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, మాజీమంత్రి కన్నబాబు తదితరులు పదేపదే ప్రస్తావిస్తున్నారు.



కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమంచేసిన ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా అవమానించిందో గుర్తుచేస్తున్నారు. పవన్ కూడా కాపుల ఓట్లపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్లున్నారు. అయితే డైరెక్టుగా తాను రంగంలోకి దిగకుండా తన మద్దతుదారుడు, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య ద్వరా వ్యవహారం నడుపుతున్నారు. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో కాపుల ఓట్లు చాలా కీలకమయ్యేట్లుగానే అనిపిస్తోంది. మరి కాపుల మనసులో ఏముందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: