అమరావతి : పాలిటిక్స్, మీడియా ఈ కేసులచుట్టూనే తిరుగుతోందా ?

Vijaya



రాష్ట్రంలోని రాజకీయాలు, మీడియా మొత్తం రెండు అంశాల చుట్టూనే తిరుగుతున్నాయి. కాబట్టి జనాలు కూడా వేరేదారిలేక వీటినే ఫాలో అవ్వాల్సొస్తోంది. ఇంతకీ ఆ రెండు అంశాలు ఏవంటే వివేకానందరెడ్డి హత్యకేసు, మార్గదర్శి చీటింగ్ కేసు.  వివేకానందరెడ్డి హత్యకేసును ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా నూరుశాతం ఫాలో అవుతున్నాయి. వివేకాహత్యలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రుందని జనాలను నమ్మించేందుకు ఎల్లోమీడియా తెగ ప్రయత్నాలు చేస్తోంది. అందుకు తగ్గట్లే అవినాష్ మీద ప్రతిరోజు రకరకాల వార్తలు, కథనాలిస్తోంది.



విచిత్రం ఏమిటంటే హత్యకేసును సీబీఐకి ప్యారలల్ గా ఎల్లోమీడియా దర్యాప్తు చేస్తోంది. హత్యకేసులో ముందు అవినాష్  అరెస్టవ్వాలని తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలన్నది చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా వ్యూహంగా అర్ధమవుతోంది. అవకాశం లేదు కాబట్టి సరిపోయింది కానీ ఉండుంటే ఈ పాటికే అవినాష్ రెడ్డితో పాటు జగన్ కు కూడా ఎల్లోమీడియా శిక్షలు వేసేసేదే. రాబోయే ఎన్నికల్లో వివేకా హత్యకేసును హైలైట్ చేయాలన్నది వీళ్ళ ప్లాన్. ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే.



ఇక మార్గదర్శి చీటింగ్ కేసులో ఛైర్మన్  రామోజీరావు, ఎండీ శైలజను ఏ1, ఏ2గా కేసులు నమోదుచేసి సీఐడీ విచారణ చేస్తోంది. మార్గదర్శి వ్యాపారంలో రామోజీ చీటింగ్ చేశారని ఇప్పటికే దాదాపు తేలిపోయింది. అయితే ఆ విషయం సుప్రింకోర్టు తీర్పుద్వారా రావాల్సుంది. ఎలాగైనా రామోజీ కత చూడాలన్నది జగన్మోహన్ రెడ్డి పట్టుదల. ఎందుకింత పట్టుదలగా ఉన్నారంటే చంద్రబాబును దెబ్బకొట్టడం కోసమే. మాంత్రికుడు ప్రాణం చిలుకలో ఉన్నట్లుగా చంద్రబాబు బలమంతా ఎల్లోమీడియానే.



చంద్రబాబును దెబ్బకొడితే ఎల్లోమీడియాకు ఏమీకాదు. అదే ఎల్లోమీడియాను దెబ్బకొడితే దాని ప్రభావం చంద్రబాబు మీద తీవ్రంగా పడుతుంది. ఇటు ఎల్లోమీడియాను అటు చంద్రబాబును ఒకేసారి, ఒకేదెబ్బతో కొట్టేయాలన్నది జగన్ వ్యూహం.  అయితే జగన్ ప్లాన్ వర్కవుటవ్వటం అంత ఈజీ కాదు. కాలంగనుక కలిసొస్తే జగన్ సక్సెస్ అవుతారు. వివేకా హత్యకేసులో అవినాష్ అరెస్టయినా జగన్ కు వచ్చే నష్టంలేదు. అవినాష్ ప్లేసులో ఎంపీగా ఇంకొకళ్ళని పెట్టుకుంటారు. కానీ రామోజీ విషయంలో జగన్ ప్లాన్ సక్సెస్ అయితే మాత్రం చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ పడటం ఖాయం. అందుకనే రెండు పక్షాలు రెండు కేసులను అత్యంత ప్రతిష్టగా తీసుకున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: