అమరావతి : అవినాష్ కు అడ్వాంటేజ్ అవుతుందా ?

Vijaya


గడచిన నాలుగేళ్ళుగా వివేకానందరెడ్డి హత్యకేసు జరిగిన విచారణ తీరు మారిపోతుందా ? అవుననే అనిపిస్తోంది. దీనికి కారణం ఏమిటంటే వివేకా రెండో భార్యగా ప్రచారంలో ఉన్న షమీమ్ తెరపైకి రావటమే.  వివేకా హత్యకు దారితీసిన కారణాలను సీబీఐకి షమీమ్ స్టేట్మెంట్ ఇచ్చారట. మూడుపేజీల స్టేట్మెంట్ లో తన భర్త హత్యకు కుటుంబతగాదాలే కారణమన్నట్లుగా చెప్పారట. వివేకా కూతురు డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డితో పాటు ఆయన సోదరుడు శివప్రకాష్ రెడ్డే ప్రధాన కారణమని షమీమ్ వివరించారట.షమీమ్ స్టేట్మెంట్లో ఆస్తి తగాదాలు, ఆర్ధిక గొడవలు, వారసత్వ ప్రకటన నేపధ్యంలోనే వివేకా హత్య జరిగినట్లు షమీమ్ ఆరోపించారట. డైరెక్టుగా వివేకా హత్యకు కూతురు, అల్లుడు, సోదరుడే కారణమని షమీమ్ చెప్పలేదు. కాకపోతే తన భర్త హత్యకు పై ముగ్గురే కారణమని అర్ధం వచ్చేట్లుగా చెప్పారని ప్రచారం జరుగుతోంది. తమను కలిసి షమీమ్ స్టేట్మెంట్ ఇచ్చారని సీబీఐ అధికారికంగా ప్రకటించలేదు. అలాగని షమీమ్ కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ మీడియా, సోషల్ మీడియాలో విపరీతంగా షమీమ్ స్టేట్మెంట్ అని వైరల్ అవుతోంది.సీబీఐని కలిసి షమీమ్ స్టేట్మెంట్ ఇచ్చిందే నిజమైతే ఈ స్టేట్మెంట్ అవినాష్ రెడ్డి వాదనను బలపరిచేదిగానే ఉంది. చాలాకాలంగా అవినాష్ ఇదే విషయాన్ని మొత్తుకుంటున్నా సీబీఐ ఏమాత్రం  పట్టించుకోవటంలేదు. వివేకా హత్యకు కుటుంబ తగాదాలు, ఆస్తి గొడవలతో పాటు వారసత్వ సమస్యలు ఉన్నాయని అవినాష్ చాలాసార్లు చెప్పారు. హత్యలో కూతురు, అల్లుడి పాత్రే ఎక్కువగా ఉందని అవినాష్ చెప్పినా సీబీఐ ఆ దిశగా ఎప్పుడూ దర్యాప్తుచేయలేదు.కేసు దర్యాప్తుకు సుప్రింకోర్టు విధించిన గడువు మరో వారంరోజుల్లో ముగుస్తుంది. సరిగ్గా ఈ సమయంలో షమీమ్ స్టేట్మెంట్ ఇచ్చారనే ప్రచారం అవినాష్ కు అడ్వాంటేజ్ అవుతుందనే అనిపిస్తోంది. వివేకా రెండో భార్య స్టేట్మెంట్ ను పట్టించుకోకుండా సుప్రింకోర్టు పక్కనపడేసే అవకాశంలేదు. కాబట్టి ఆమె స్టేట్మెంట్ ను కూడా పరిగణలోకి తీసుకోమని సీబీఐని సుప్రింకోర్టు ఆదేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పనిలోపనిగా గడువును కూడా ఏప్రిల్ 30వ తేదీ నుండి మరింత పెంచే అవకాశముంది. షమీమ్ పిక్చర్లోకి రావటంతో కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: