ఢిల్లీ : వివేకా హత్య కేసులో సుప్రింకోర్టుకు వేరే దారిలేదా ?

Vijaya



హత్యకేసులో గడువు పెంచక సుప్రింకోర్టుకు వేరేదారిలేదా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. వివేకానందరెడ్డి మర్డర్ కేసు విచారణ ముగించేందుకు సీబీఐకి సుప్రింకోర్టు ఈనెల 30వ తేదీని గడువుగా విధించింది. హత్య జరిగి నాలుగేళ్ళు దాటినా హత్యకు ప్రధాన కారణం ఏమిటి ? నిందితుల్లో  ఎవరి పాత్ర ఎంత ? లాంటి కీలకమైన కారణాలను సీబీఐ బయటకు తీయలేకపోయింది.



హత్య చేసిందెవరు ? ఎంతమంది పాల్గొన్నారు అనే విషయాలపపై సీబీఐకి క్లారిటి వచ్చింది. అయితే హత్యకు దారితీసిన కారణాలు ఏమిటి ? ఎవరి ప్రోద్బలంతో హత్య జరిగిందనే విషయంపైనే స్పష్టత లేదు.  ఎంతసేపు హత్యలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిదే  కీలకపాత్రని సీబీఐ వాదిస్తోంది. హత్యతో తమకు సంబంధంలేదని, వివేకాను హత్య చేయాల్సిన అవసరం తమకు లేదని వీళ్ళు వాదిస్తున్నారు.



నాలుగేళ్ళు గడిచినా కీలకమైన విషయాలపై ఎలాంటి పురోగతి లేకపోవటంతో మండిపోయిన సుప్రింకోర్టు దర్యాప్తు అధికారిని మార్చేసింది. అలాగే దర్యాప్తుకు 30 రోజుల గడువు విధించింది. ఆ గడువు మరో తొమ్మిదిరోజుల్లో ముగుస్తోంది. అయితే అప్పటికి ఇప్పటికీ విచారణలో ఎలాంటి పురోగతి కనబడలేదు. పైగా నిందుతులు, అనుమానితులు, విచారణను ఎదుర్కొంటున్న వాళ్ళంతా ఒకళ్ళపై మరొకళ్ళు కేసులు వేసుకున్నారు. హత్యలో కీలకపాత్ర పోషించిన వాళ్ళల్లో ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి కూడా ఉన్నారు.



గంగిరెడ్డి బెయిల్ రద్దుచేయాలని సీబీఐ కేసు వేస్తే దస్తగిరి బెయిల్ రద్దుచేయాలని భాస్కరెడ్డి పిటీషన్ వేశారు. అవినాష్ మధ్యంతర బెయిల్ రద్దుచేయాలని వివేకా కూతురు సునీత పిటీషన్ వేశారు. తమకు బెయిల్ ఇవ్వాలని డాక్టర్ ఉదయ్, భాస్కరరెడ్డి బెయిల్ పిటీషన్ వేశారు. ఇవన్నీ ఒకఎత్తయితే వివేకా రెండో భార్యగా ప్రచారంలో ఉన్న షమీమ్ కూడా కోర్టులో పిటీషన్ వేశారట. తన భర్త హత్య కేసులో తన వాదన కూడా వినాలని ఆమె పిటీషన్లో రిక్వెస్టు చేసుకున్నారట. సహజన్యాయం జరగాలంటే అందరి వాదనలు వినాల్సిందే.  ఎవరి వాదనా వినకుండా కేసు కొట్టేసేందుకు లేదు.  ఒక్కసారిగా ఇన్ని కేసులు దాఖలైన నేపధ్యంలో వాదనలు విని నిర్ణయం తీసుకోవాలంటే హైకోర్టుకు కొన్ని వారాలు పడుతుంది. కాబట్టి సుప్రింకోర్టుకు గడువు పెంచటం తప్ప వేరే మార్గంలేదనే అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: