అమరావతి : బెజవాడలో అన్నదమ్ముల సవాల్

Vijaya



రాబోయే ఎన్నికల్లో మిగిలిన సీట్ల సంగతి ఎలాగున్నా బెజవాడ ఎంపీ సీటు విషయంలో మాత్రం చంద్రబాబునాయుడుకు తలనొప్పులు తప్పేట్లు లేదు. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ కేశినేని నానీకి చంద్రబాబుకు మధ్య బాగా గ్యాప్ పెరిగిపోయింది. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎంపీ పెద్దగా కనబడటంలేదు. అలాగని పార్టీని వదిలేశారా అంటే అదీలేదు. పార్టీలోనే ఉంటారు, అధినేతతో పాటు పార్టీ నేతలను ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారు. దాంతో నానీతో లాభంలేదని అనుకుని చంద్రబాబే ఎంపీ తమ్ముడు కేశినేని చిన్నీని తెరపైకి తెచ్చారు.



చంద్రబాబు ఎంకరేజ్ చేయటంవల్లే చిన్నీ విజయవాడ ఎంపీ అభ్యర్ధిగా పార్టీతో పాటు జనాల్లో చొచ్చుకుపోతున్నారు. నియోజకవర్గాల్లోని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే ఎంపీ కూడా పార్టీలో యాక్టివ్ గా తిరగటం మొదలుపెట్టారు. దాంతో పార్టీ నేతల్లో కన్ఫ్యూజన్ మొదలైపోయింది. రాబోయే ఎన్నికల్లో ఎంపీగా అన్నదమ్ముల్లో ఎవరు పోటీచేస్తారో తమ్ముళ్ళకి అర్ధం కావటంలేదు. ఎంపీ అంటే పడని బోండా ఉమ, బుద్ధా వెంకన్న, దేవిని ఉమ, నాగుల్ మీరా తమ్ముడు చిన్నీతో సఖ్యతగా ఉంటున్నారు. ఇదే సమయంలో పై నేతలంటే పడని వాళ్ళంతా చిన్నీని దూరంగా ఉంచుతున్నారు.



ఈ నేపధ్యంలోనే చిన్నీ మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో ఎంపీ టికెట్ తనకిచ్చినా పర్వాలేదు ఇంకెవరికి ఇచ్చినా పర్వాలేదు అన్నారు. దాంతో చిన్నీ మనసులోని మాటేమిటో అర్ధంకావటంలేదు. ఇక్కడ ఒక విషయం స్పష్టమైంది ఏమిటంటే అన్న దమ్ముల మధ్య చీలిక వచ్చేసిందని. ఒకపుడు అన్నచాటు తమ్ముడిగానే ఉన్న చిన్నీని చంద్రబాబే చేరదీశారు. దాంతో చిన్నీ ఇపుడు  రెచ్చిపోతున్నారు.



అన్నదమ్ముల మధ్య విబేధాల వల్ల పార్టీలోని నేతల మధ్య కూడా చీలికొచ్చేసింది. దాంతో రాబోయే ఎన్నికల్లో ఎంపీ టికెట్ అన్నదమ్ముల సవాలుగా మారబోతోంది. ఇద్దరిలో ఎవరికి చంద్రబాబు టికెట్ ఇచ్చినా సమస్యలు అయితే తప్పేట్లులేదు. అన్నకు టికెట్ ఇస్తే వ్యతిరేకవర్గంతో పాటు తమ్ముడూ పనిచేయడు. అలాగే చిన్నీకి టికెటిస్తే అన్నతో పాటు ఆయన వర్గం సహకరించదు. మరి అన్నదమ్ముల సవాలు పార్టీని ఏమిచేస్తుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: