అమరావతి : టీడీపీలో ‘ముందస్తు’ ఫీవర్ పెరిగిపోతోందా ?

Vijaya


తెలుగుదేశంపార్టీ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటోంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఏ క్షణంలో అయినా వచ్చేస్తాయని పదేపదే తమ్ముళ్ళ మైండ్ సెట్ ను చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు ట్యూన్ చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల అవసరంలేదని జగన్మోహన్ రెడ్డి ఈమధ్యనే పార్టీ ముఖ్యనేతల సమావేశంలో చెప్పారు. జగన్ ఇంత స్పష్టంగా చెప్పినా చంద్రబాబు మాత్రం ముందస్తు జపం మానటంలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలంటే ఆ నిర్ణయం తీసుకోవాల్సింది జగన్ మాత్రమే.



ప్రతిపక్షాలు ఎంత గోలచేసినా ముందస్తు ఎన్నికలు రావన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ జగన్ గనుక ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని అనుకుంటే అప్పుడు ఎన్నికలకు సిద్ధమవటం తప్ప ప్రతిపక్షాలకు మరోదారిలేదు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఈ విషయం ఇంకోళ్ళు చెప్పాల్సిన అవసరమేలేదు.  విషయం ఇంత స్పష్టంగా ఉన్నాకూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళమని జగన్ను టీడీపీ అధినేత చాలెంజ్ చేస్తుండటమే విచిత్రంగా ఉంది.



చంద్రబాబు చాలెంజ్ చేశారనో లేకపోతే అచ్చెన్న రెచ్చగొడుతున్నారనో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళరు. మరి జగన్ నుండి ఏమాశించి చంద్రబాబు, అచ్చెన్న పదేపదే ముందస్తు ఎన్నికలంటు గోల చేస్తున్నారో అర్ధంకావటంలేదు. పాదయాత్రతో లోకేష్ ప్రజలకు ముఖ్యంగా యువతకు బాగా దగ్గరైపోయారని, ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అధికారం టీడీపీదే అని అచ్చెన్న నానా రచ్చ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చేందుకు  అన్నీ పరిస్ధితులు టీడీపీకి అనుకూలంగా ఉన్నపుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళి జగన్ అధికారాన్ని పోగొట్టుకుంటారా ?



పరిస్ధితులన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయనుకుంటేనే ఎవరైనా ముందస్తు ఎన్నికలగురించి ఆలోచిస్తారు. లేదా తప్పని పరిస్ధితుల్లో కూడా ముందస్తు గురించి ఆలోచిస్తారు. ఒకసారి ఇలా ఆలోచించే చంద్రబాబు 2003లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి దెబ్బతిన్నారు. చంద్రబాబు, అచ్చెన్న గోలకు లొంగిపోయి జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారని ఎవరు అనుకోవటంలేదు. కాబట్టి ముందస్తు ఫీవర్ లో నుండి చంద్రబాబు, అచ్చెన్న బయటపడి పార్టీని బలోపేతం చేసుకోవటంలోను, అన్నీ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఫైనల్ చేసుకోవటంపై దృష్టిపెడితే బాగుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: