అమరావతి : పవన్ స్ధానాన్ని కిరణ్ రీప్లేస్ చేయబోతున్నారా ?

Vijaya


తొందరలోనే జరగబోయే కర్నాటక ఎన్నికల్లో కిరణ్ కు కీలక బాధ్యతలను బీజేపీ అధిష్టానం అప్పగించబోతోందా ? పార్టీవర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో తెలుగు ప్రజలదే డామినేషన్. అందుకని తెలుగువాళ్ళ ఓట్లకోసం గురువారమే పార్టీలో చేరిన మాజీముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించే అవకాశముందని సమాచారం. కర్నాటక ఎన్నికలపై పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో జరిగిన సమావేశంలో అమిత్ షా,  కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, బీఎల్ సంతోష్ తో పాటు కిరణ్ కూడా పాల్గొన్నారు.



కర్నాటక ఎన్నికలపైన జరిగిన కీలకమైన సమావేశంలో కిరణ్ ను కూడా ఇన్వాల్వ్  చేయటంతోనే కీలకమైన బాధ్యతలనే అప్పగించబోతున్నట్లు ప్రచారం మొదలైంది. కోలారు, చిక్ మగళూరు, బళ్ళారి, తుముకూరు, ఉడిపి, షిమోగా, బెంగుళూరు సిటీ లాంటి ప్రాంతాల్లో తెలుగువాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఒక అంచనా ప్రకారం సుమారు 60 నియోజకవర్గాల్లో తెలుగువాళ్ళదే మెజారిటి. సో, తెలుగువాళ్ళు ఉన్న నియోజకవర్గాల్లో కిరణ్ తో  ప్రచారం చేయించే  అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. కిరణ్ ప్రచారంచేసిన నియోజకవర్గాల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తే కిరణ్ కు ప్రాధాన్యత పెరిగి పవన్ను పట్టించుకోవటం మానేస్తారు.



ఈమధ్యనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ టూరులో నడ్డాతో భేటీ అయినపుడు ఇదే విషయం చర్చకు వచ్చినట్లు తెలిసింది. కర్నాటక ఎన్నికల్లో తెలుగువాళ్ళుండే చోట ప్రచారం చేయమని పవన్ను పార్టీ అధ్యక్షుడు నడ్డా అడిగారట. అయితే పవన్ ఏమో చంద్రబాబునాయుడుతో పొత్తు విషయంపైన పట్టుబట్టినట్లు బీజేపీలో ప్రచారం జరుగుతోంది. పొత్తు విషయం ఫైనల్ అయ్యేంతవరకు తాను కర్నాటకలో ప్రచారం చేసే విషయాన్ని చెప్పలేనని చెప్పి పవన్ హైదరాబాద్ వచ్చేశారనే ప్రచారం జరుగుతోంది.



టీడీపీతో పొత్తు పెట్టుకోవటం బీజేపీకి ఇష్టంలేదు. అందుకనే పవన్ తో ప్రచారం చేయించే విషయాన్ని బీజేపీ అగ్రనేతలు పక్కనపెట్టేశారట.  కాబట్టి  కిరణ్ తో ప్రచారం చేయించేందుకు రెడీ అవుతున్నారనేది తాజా టాక్. అభ్యర్ధులు, ప్రచార బాధ్యతలు, స్టార్ క్యాంపెయినర్ల వ్యవహారాలన్నీ ఆదివారం నరేంద్రమోడీ ఆధ్వర్యంలో జరగబోయే పార్లమెంటరీ బోర్డు డిసైడ్ చేస్తుంది. కాబట్టి కిరణ్ విషయం ఆదివారం తేలిపోతుంది.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: