ఉత్తరాంధ్ర : జనసేనతో మైండ్ గేమ్ ఆడుతున్నారా ?

Vijaya


కొద్దిరోజులుగా చంద్రబాబునాయుడు వ్యవహారం చూస్తుంటే  అలాగే అనిపిస్తోంది. తాజాగా విశాఖపట్నంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జోన్ తమ్ముళ్ళ సమావేశంలో మాట్లాడింది విన్నతర్వాత అనుమానం కన్ఫర్మ్ అవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కొద్దిరోజులుగా చంద్రబాబు బాడీ ల్యాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. నాలుగు ఎంఎల్సీ ఎన్నికల్లో పార్టీ గెలుపు చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళల్లో బాగా కిక్ ఇచ్చింది. అందుకనే ఎక్కడ మాట్లాడినా రాబోయే ఎన్నికల్లో టీడీపీదే అధికారం అంటు రెచ్చిపోతున్నారు.ఇదే చంద్రబాబు కొద్దిరోజుల క్రితం ఎక్కడ మాట్లాడినా ప్రతిపక్షాలు ఏకమైతే కానీ జగన్మోహన్ రెడ్డిని ఓడించలేమని పదేపదే చెప్పేవారు. ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రాకపోతే మళ్ళీ జగనే గెలుస్తాడని కూడా చెప్పారు. రెండోసారి జగన్ అధికారంలోకి రాకూడదంటే ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాల్సిందే అని మొత్తుకునే వారు. ఇదే విషయమై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి ఐక్యపోరాటాలు చేస్తామన్నారు. పవన్ తో మూడుసార్లు భేటీ అయ్యారు.అయితే ఎంఎల్సీ ఎన్నికల్లో గెలుపు తర్వాత అసలు జనసేన ఊసే ఎత్తటంలేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే నామినేషన్లు వేస్తే టీడీపీ అభ్యర్ధులు గెలిచిపోయినట్లే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. టీడీపీని గెలిపించేందుకు జనాలంతా కాచుక్కూర్చున్నట్లుగా  చంద్రబాబు చెబుతున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నేతల అరాచకాలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయించి అందరినీ లోపలేయించేస్తానని వార్నింగులిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పొరబాటున కూడా చంద్రబాబు ప్రతిపక్షాలు అన్న పదాన్ని ఎక్కడా వాడటంలేదు.ఎక్కడ మాట్లాడినా టీడీపీ అధికారంలోకి వచ్చేయటం ఖాయమనే అంటున్నారు. ఇదేసమయంలో తమ్ముళ్ళు కూడా జనసేనతో పొత్తు వద్దే వద్దంటున్నారట. ఒంటరిగా పోటీచేసినా గెలుపు ఖాయమన్నపుడు జనసేనతో పొత్తు అవసరం ఏముందని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారట. ఇలాంటి అనేక కారణాలతో చంద్రబాబు దృష్టిలో జనసేన వెనకబడిపోయినట్లుంది. ఎన్నికల సమయంలో జనసేనతో పొత్తుపెట్టుకున్నా సీట్ల విషయంలో తాను చెప్పిందే ఫైనల్ అయ్యేట్లుగా చంద్రబాబు ప్లాన్ రెడీ చేసుకున్నట్లు అనిపిస్తోంది. అందుకనే జనసేన అవసరం తమకు లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: