అమరావతి : ఈమె నిజంగా మహానటేనా ?

Vijaya
తాడికొండ ఎంఎల్ఏ ఉండవల్లి శ్రీదేవి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. క్రాస్ ఓటింగుకు తాను పాల్పడలేదని చెప్పారు. క్రాస్ ఓటింగ్ గురించి, జగన్మోహన్ రెడ్డి వైఖరిగురించి, ప్రభుత్వం పనితీరు  గురించి చాలా వ్యాఖ్యలే చేశారు. జగన్ అంటే తనకు అపారమైన గౌరవం అంటునే తనకున్న కోపాన్నంతా వెళ్ళగక్కేశారు. వైసీపీ నుండి సస్పెండ్ అయిన తర్వాత తాను స్వతంత్ర ఎంఎల్ఏగా కంటిన్యు అవుతానని చెప్పారు. తొందరలోనే కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.అంతాబాగానే ఉందికానీ రాజధాని గురించి చెప్పిన మాటలే ఆశ్చర్యంగా ఉంది. రాజధానిగా అమరావతి కోసం తాను కృషిచేస్తానన్నారు. అమరావతి ప్రాంతంలో రైతుల తరపున తాను పోరాటాలు చేస్తానని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఇక్కడ విషయం ఏమిటంటే పార్టీనుండి సస్పెండ్ అయ్యేంతవరకు మూడు రాజధానుల కాన్పెప్టుకు మద్దతుగానే మాట్లాడేవారు. అమరావతి కోసం జరుగుతున్న ఆందోళనలను ఎంఎల్ఏ పెయిడ్ ఆందోళనలుగా ఎన్నోసార్లు వర్ణించారు. రైతుల్లో చాలామంది పెయిడ్ ఆర్టిస్టులేనంటు ఎద్దేవాచేశారు.రాజధానిగా అమరావతిని చంద్రబాబునాయుడు అండ్ కో తప్ప ఇంకెవరూ అనుకోవటంలేదన్నారు. తనకు వ్యతిరేకంగా ఆందోళనచేసిన వారిపైకి పోలీసులను ఉసిగొల్పారు. అమరావతికి వ్యతిరేకంగా, ఆందోళనలు చేస్తున్నవారిపై వైసీపీ ఎంఎల్ఏగా ఏమేమి చేయగలరో అవన్నీ చేశారు. అలాంటిది పార్టీనుండి సస్పెండ్ కాగానే ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించేశారు. అమరావతి రాజధాని కోసం పోరాటాలు చేస్తారట. రైతులు, మహిళల పక్షాన నిలబడతారట. రాజధానికోసం ముందుండి తాను పోరాటాలు చేస్తానని చాలా మాటలే చెప్పారు.ఇక్కడ విషయం ఏమిటంటే నాలుగేళ్ళపాటు తమను ఇబ్బందులు పెట్టిన శ్రీదేవిని అమరావతి ప్రాంతం ప్రజలు నమ్ముతారా ? ఇపుడు పార్టీనుండి సస్పెండ్ అయ్యారు కాబట్టే ప్లేటు ఫిరాయించారు. ఇందుకనే నెటిజన్లు శ్రీదేవిని మహానటి అంటు సెటైర్లు వేస్తున్నారు. రాజధానిపై అప్పట్లో మాట్లాడిన మాటలు, తాజా డైలాగుల వీడియోలను వైరల్ చేస్తున్నారు.  బహుశా వచ్చేఎన్నికల్లో చంద్రబాబునాయుడు తనకు టికెట్ ఇస్తారని అనుకుంటున్నట్లున్నారు. 2014-19 మధ్యలో  ప్రలోభాలకు గురైన వైసీపీ ఎంఎల్ఏల పరిస్దితి ఏమైపోయిందో శ్రీదేవి కాస్త గమనిస్తే బాగుంటుంది. చంద్రబాబుపై ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా ఉంటే ఎంఎల్ఏకే మంచిది. లేకపోతే తీవ్ర నిరాసకు గురికాక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: