అమరావతి : 23పై జగన్ కీలక నిర్ణయం

Vijaya



శాసనమండలి ఎన్నికల తాజా ఫలితాల నేపధ్యంలో జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 23వ తేదీన ఎంఎల్ఏ కోటా ఏడు ఎంఎల్సీ స్ధానాల ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే. మామూలుగా అయితే ఈ ఏడుస్ధానాలూ వైసీపీ ఖాతాలోనే పడతాయి. కానీ చివరినిముషంలో టీడీపీ తరపున పంచుమర్తి అనూరాధ నామినేషన్ వేయటంతో పోటీ అనివార్యమైంది. గెలుపు అవకాశాలు దాదాపు లేకపోయినా క్రాస్ ఓటింగు మీద ఆశలతోనే టీడీపీ పోటీలోకి దిగింది.



సరిగ్గా ఈ విషయంలోనే జగన్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే 23వ తేదీ పోలింగుకు ముందే మాక్ పోలింగ్ నిర్ణయించాలని. అలాగే ప్రతి అభ్యర్ధికి 22 మంది ఎంఎల్ఏల ఓట్లు కేటాయించాలని. అంటే పార్టీ తరపున పోటీచేస్తున్న ఏడుగురు ఎంఎల్సీ అభ్యర్ధులకు ఓట్లేయాల్సిన 22 మంది ఎంఎల్ఏలను ఫైనల్ చేయబోతున్నారు. ప్రతి ఎంఎల్సీ అభ్యర్ధికి ఓట్లేయాల్సిన 22 మందిని కేటాయించబోతున్నారు. ఓటింగ్ లో ఎలాంటి అయోమయం లేకుండా ఒకటికి రెండుసార్లు ట్రయల్ పోలింగ్ (మాక్ పోలింగ్) చేయించాలని డిసైడ్ అయ్యారు.



క్రాస్ ఓటింగుకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్నది జగన్ ఆలోచన. ఆత్మప్రభోదం అని మరోటని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో రెబల్ గా మారిన  కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలీదు. ఆత్మప్రభోదం ప్రకారమే తాము ఓట్లేస్తామని ఇప్పటికే వీళ్ళు ప్రకటించారు.



జగన్ లెక్కల ప్రకారం పార్టీ తరపున కచ్చితంగా ఏడుగురు ఎంఎల్సీలు గెలవాల్సిందే. నిర్లక్ష్యంగా ఉంటే ఏమి జరుగుతుందనేందుకు రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటమే ఉదాహరణగా నిలిచింది. అందుకనే జరగబోయే ఎన్నికలపైన జగన్ దృష్టిపెట్టారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుండి రాగానే కొందరు మంత్రులు, ముఖ్యనేతలతో ఈ విషయంపైనే జగన్ సీరియస్ గా చర్చించారట. 23 పోలింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు తాజా ఫలితాలపై సమీక్ష చేయాలని అనుకున్నట్లు సమాచారం. మంత్రులు, ఎంఎల్ఏలు, నేతల నిర్లక్ష్యం వల్లే రెండుచోట్లా ఓడిపోయినట్లు జగన్ కు ఫీడ్ బ్యాక్ వచ్చిందట. మరి 23 తర్వాత పోస్టుమార్టమ్ లో ఏమి తేలుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: