హైదరాబాద్ : తుమ్మలకు కేసీయార్ షాకిచ్చారా ?

Vijaya


మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడిపోయింది. ఎంఎల్ఏ కోటాలో భర్తీ చేయాల్సిన మూడు ఎంఎల్సీ స్ధానాలకు కేసీయార్ అభ్యర్దులను ప్రకటించారు. నవీన్ కుమార్, చల్లా వెంకట్రామరెడ్డి, దేశపతి శ్రీనివాస్ తొందరలోనే నామినేషన్లు వేయబోతున్నారు. వీరిలో నవీన్ కుమార్ కు రెన్యువల్ దొరికితే మిగిలిన ఇద్దరు కొత్త అభ్యర్ధులే. ఇపుడు కేసీయార్ ప్రకటించిన మూడుపేర్లలో ఒకస్ధానాన్ని తుమ్మలకు రిజర్వుచేశారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. ఎంఎల్సీ ఇచ్చి తుమ్మలను మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు జరిగిన ప్రచారం అందరికీ తెలిసిందే.
నిజానికి చాలాకాలంగా కేసీయార్ తో తుమ్మల అంటీముట్టనట్లుంటున్నారు. ఒకపుడు వీళ్ళిద్దరు బాగా సన్నిహితులే అయినా కొంతకాలంగా బాగా గ్యాప్ వచ్చేసింది. వచ్చేఎన్నికల్లో పాలేరులో పోటీచేయాలని తుమ్మల అనుకున్నారు. అయితే సిట్టింగులందరికీ టికెట్ అని కేసీయార్ చేసిన ప్రకటనతో తుమ్మల ఆశలపై నీళ్ళు చల్లినట్లయ్యింది. కేసీయార్ ప్రకటన ప్రకారం సిట్టింగ్ ఎంఎల్ఏ కందాళం ఉపేంద్రరెడ్డికే టికెట్ ఖాయమని అనుకోవాలి. దాంతో టీఆర్ఎస్ తరపున పోటీచేయటానికి జిల్లాలో తుమ్మలకు నియోజకవర్గమే లేదు.ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీల్లో చేరమని తుమ్మలపై ఒత్తిడి మొదలైంది. మద్దతుదారులు కూడా బీఆర్ఎస్ ను వదిలేసి ఏదో ఒక పార్టీలో చేరాలని పదేపదే చెబుతున్నారు. అందుకనే అభిప్రాయసేకరణ కోసమని ఆత్మీయ సమావేశాలు పెట్టుకున్నారు. ఈ సమయంలోనే ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశం జరిగింది. బహిరంగసభ నిర్వహణలో తుమ్మల భాగస్వామ్యం అవసరమని గ్రహించిన కేసీయార్ ఫోన్ చేసి మాట్లాడారు.బహిరంగసభకు ఇన్చార్జయిన హరీష్ రావు ఫోన్ చేసి ఇద్దరినీ మాట్లాడించారు. ఆ తర్వాతే తుమ్మలకు ఎంఎల్సీ ఇస్తానని కేసీయార్ హామీ ఇచ్చినట్లు ప్రచారం పెరిగిపోయింది. మంగళవారం వరకు మద్దతుదారులు అదే నమ్మకంతో ఉన్నారు. కానీ అభ్యర్ధుల  ప్రకటనతో ఒక్కసారిగా తుమ్మలకు షాక్ కొట్టినట్లయ్యింది. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న సమయంలో ఇంకా నాన్చుడు ధోరణిలో ఉంటే మొదటికే మోసం వస్తుందని మద్దతుదారులు బాగా ఒత్తిడి పెంచేస్తున్నారు.  ఈ నేపధ్యంలోనే తుమ్మల ఏమి నిర్ణయించుకుంటారనేది ఆసక్తిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: