రాయలసీమ : లోకేష్-రాధా భేటీ ఇందుకేనా ?

Vijaya




వంగవీటి రాధాకృష్ణలో అయోమయం పెరిగిపోతోందా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలుగుదేశంపార్టీలోనే ఉన్నారు కానీ యాక్టివ్ గా లేరు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 14వ తేదీన జనసేనలో చేరుతారనే ప్రచారం బాగా జరుగుతోంది. దీనికి ఊతమిచ్చేట్లుగా పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ తో రెండుసార్లు భేటీ అయ్యారు. అలాంటిది హఠాత్తుగా ఈరోజు నారా లోకేష్ తో సమావేశమవబోతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది.



పాదయాత్ర చేస్తున్న లోకేష్ తో పీలేరులో రాధా సమావేశం అవబోతున్నారట. ఒకవైపు జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుంటే ఇపుడు లోకేష్ తో ఎందుకు భేటీ అవుతున్నారో ఎవరికీ అర్ధంకావటంలేదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీచేయాలనేది రాధాకున్న బలమైన కోరిక. టీడీపీలో ఉంటే అది ఎప్పటికీ సాధ్యంకాదు. ఎందుకంటే మాజీ ఎంఎల్ఏ బోండా ఉమామహేశ్వరరావును కాదని చంద్రబాబునాయుడు రాధాకు టికెట్ ఇచ్చే అవకాశంలేదు.



ఎలాగూ టీడీపీ-జనసేన మధ్య పొత్తుండే అవకాశాలున్నాయి. కాబట్టి సెంట్రల్ సీటును జనసేన తీసుకుని అప్పుడు తాను పోటీచేయాలని రాధా అనుకుంటున్నట్లున్నారు. ఒకవేళ సెంట్రల్లో పోటీచేసే అవకాశాన్ని బోండాకు కాకుండా తనకే ఇస్తే టీడీపీలోనే కంటిన్యు అయ్యే అవకాశాలపై లోకేష్ తో రాధా మాట్లాడబోతున్నారా ? అనే చర్చ కూడా మొదలైంది. కొన్ని నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్ధులను ఎలాగూ లోకేష్ ప్రకటించేస్తున్నారు. కాబట్టి విజయవాడ సెంట్రల్ విషయాన్ని కూడా లోకేషే ఫైనల్ చేయబోతున్నారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.



ఏదేమైనా ఇపుడు పార్టీతో పాటు రాబోయే ఎన్నికల్లో తన ముద్ర ఉండాలని లోకేష్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నది వాస్తవం. ఇందులో భాగంగానే పాదయాత్ర మొదలుపెట్టారు. చిత్తూరు జిల్లాలో పాదయాత్ర మొదలుపెట్టిన లోకేష్ ఇప్పటికి ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించారు. కాబట్టి ముందుముందు మరిన్ని టికెట్లను ప్రకటించే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగానే విజయవాడ సెంట్రల్ టికెట్ మీద కూడా లోకేష్ కసరత్తు చేశారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లేకపోతే ఇంత హఠాత్తుగా వంగవీటి రాధాతో భేటీ అవ్వాల్సిన అవసరమే లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: