అమరావతి : బీజేపీ కతేంటో తేలిపోతుందా ?

Vijaya


శాసనమండలి ఎన్నికల్లో పోటీచేస్తున్న అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధులతో పాటు బీజేపీ అభ్యర్ధులు కూడా పోటీచేస్తున్నారు. సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి రాబోయేది తామే అని కమలనాదులు పదేపదే చెప్పుకుంటున్నారు. ఇలాంటి మాటలుచెప్పే నేతలకే ఎంఎల్సీ రూపంలో అసలైన పరీక్ష ఎదురైంది. టీచర్స్, గ్రాడ్యేయేట్స్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధులు పోటీలోకి దిగారు. మూడు పట్టభద్రుల నియోజకవర్గాలకు, రెండు టీచర్ల నియోజకవర్గాలకు జరగబోతున్న ఎన్నికల్లో పార్టీ సీనేంటో తేలిపోతుంది. పట్టభద్రుల  నియోజకవర్గాల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.



బీజేపీ తరపున పోటీచేస్తున్న ఐదుగురు అభ్యర్ధుల గెలుపు బాధ్యతలను కొందరు కీలకమైన నేతలపైన పార్టీ నాయకత్వం ఉంచింది.  బీజేపీ చీఫ్ సోమువీర్రాజు నాయకత్వంలో పార్టీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఓబీసీ విభాగం జాతీయ నేత డాక్టర్ పార్ధసారధి, రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడుకు అభ్యర్ధులను గెలిపించే బాధ్యతలను అప్పగించింది.



ఇక్కడ విషయం ఏమిటంటే పై నేతలంతా మీడియా పులులనే చెప్పాలి. మీడియా సమావేశాల్లో, ఛానళ్ళ డిస్కషన్లలో మిగిలిన పార్టీల ప్రతినిధులపై రెచ్చిపోతుంటారు. తాము గనుక రంగంలోకి దిగితే మిగిలిన పార్టీల సంగతి అంతే అన్నట్లుగా మాట్లాడుతుంటారు. కానీ ఎప్పుడూ రంగంలోకి దిగింది మాత్రంలేదు. అలాంటిది ఇపుడు తప్పనిసరి పరిస్ధితుల్లో జనాల్లో తిరగాల్సొస్తోంది.  అభ్యర్ధుల గెలుపు బాధ్యతలు వీళ్ళపై మోపిన నాయకత్వం వీళ్ళ పనితీరును ప్రత్యక్షంగా పర్యవేక్షించబోతోంది.



ఎందుకంటే పట్టభద్రులు, టీచర్ల నియోజకవర్గాల ఎన్నికలే అయినప్పటికీ జనాల మొగ్గు ఎటువైపుంది అనేది తెలుస్తుంది. ప్రతి అభ్యర్ధికి సుమారు 1.5 మంది ఓట్లేయాల్సుంటుంది. పైగా ఓటర్లంతా పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్లే కాబట్టి ప్రభుత్వ పనితీరుపై వీళ్ళ ఆలోచనలేంటో తెలుస్తుంది. ప్రతి ఎంఎల్సీ స్ధానమూ 3 జిల్లాల్లో విస్తరించుంది. అంటే జిల్లాలో సగటున 50 వేల ఓట్లుండబోతున్నాయి. ఈ నేపధ్యంలో అభ్యర్ధుల సంగతి వదిలేస్తే గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకున్న నేతలంతా బాగా చెమటోడ్చాల్సిందే. నిజానికి ఈ ఎన్నికలు పై నేతల సామర్ధ్యానికే అసలైన పరీక్షగా నిలబోతున్నాయని చెప్పాలి. మరి ఏమి చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: