అమరావతి : కుటుంబసభ్యులనూ ఇరికించేస్తున్నారా ?

Vijaya


తాజాగా ఏపీ సీఐడీ పోలీసులు మాజీమంత్రి పొంగూరు నారాయణ కూతుర్ల ఇళ్ళల్లో సోదాలు చేయటం తెలుగుదేశంపార్టీలో  కలకలం రేపింది. అమరావతి ల్యాండ్ స్కామ్ లో ఇరుక్కున్న టీడీపీ ప్రముఖల పేర్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రకటించింది. రాజధాని వ్యవహారంలో అంతా తానై వ్యవహారాలు నడిపించిన నారాయణపైన సహజంగానే ఎక్కువ దృష్టి పడింది. ఇప్పటికే భూ స్కామ్ లో కీలకపాత్ర పోషించారనే ఆరోపణలపై నారాయణను సీఐడీ అరెస్టు చేసింది. అయితే ఆయన బెయిల్ తెచ్చుకున్నారు.నారాయణ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఇపుడు ఆయన కూతుర్ల ఇళ్ళల్లో సోదాలు జరిగింది.  కీలకమైన డాక్యుమెంట్లతో పాటు మనీ రూటింగ్ కు సంబంధించి ఆధారాలు దొరికాయనే ప్రచారం పెరిగిపోతోంది. ఇదే నిజమైతే వాళ్ళపైన కూడా కేసులు పెట్టి అరెస్టుచేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇక మిగిలిన వాళ్ళ విషయాలు చూస్తే చంద్రబాబునాయుడుతో పాటు రావెల కిషోర్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, దూళిపాళ నరేంద్ర, సుజనా చౌదరి, పరిటాల సునీత లాంటి అనేకమంది పేర్లు అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది.ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే చంద్రబాబు హెరిటేజ్ సంస్ధ పేరుతో భూములు కొన్నారు. రావెల ఆయన భార్య పేరుతో భూములు కొన్నారు. పయ్యావుల కొడుకుల పేర్లతోను, యనమల కూతుళ్ళు పేర్లమీద, సుజనా కుటుంబసభ్యుల పేర్లు, ప్రత్తిపాటి భార్యపైన, నరేంద్ర భార్య, పిల్లల పైన రిజిస్ట్రేషన్లు చేయించినట్లు ప్రభుత్వమే ప్రకటించింది. ఎంతమంది ప్రముఖులు భూములు కొన్నారో ఎంతమంది తమ భార్యలు, సంతానం లేదా కుటుంబసభ్యుల పేర్లపై రిజిస్ట్రేషన్లు చేయించారో బయటపడాలి.ఇపుడు సమస్య ఏమిటంటే వీళ్ళలో చాలామందిపై ఇప్పటికే సీఐడీ విచారణకు ఫైల్స్ రెడీ చేసింది. కోర్టు స్టే కారణంగా అన్నీ ఆగిపోయున్నాయి. ఒకసారి కోర్టు గనుక అనుమతిస్తే వెంటనే అందరిపైనా విచారణ మొదలవుతుంది. అప్పుడు భూములు కొన్నవాళ్ళతో పాటు వాళ్ళ భార్యలు, కుటుంబసభ్యులపైన కూడా కేసులు, విచారణ మొదలవుతుంది. ఒకపుడు ఇలా ఆస్తులు కూడబెట్టేవారు తమ కుటుంబాలతో సంబంధం లేనివాళ్ళ పైన ఆస్తులు పెట్టేవారు.కానీ ఇప్పుడు జరిగింది చూస్తే టీడీపీలో చాలామంది ప్రముఖులు రాజధాని ప్రాంతంలో భూములను తమ వాళ్ళపైనే రిజిస్ట్రేషన్లు చేయించేసుకున్నారు. కనీసం 20 ఏళ్ళు టీడీపీనే అధికారంలో ఉంటుందన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ప్రముఖుల్లో అత్యధికులు తమ భార్యలు, కుటుంబసభ్యుల పేర్లపైనే రిజిస్ట్రేషన్లు చేయించినట్లున్నారు. దాంతో తాము ఇరుక్కోవటం కాకుండా భార్య, కుటుంబసభ్యులను కూడా ఇరికించినట్లు నారాయణ ఉదంతం చూస్తే అర్ధమవుతోంది. మరి వీళ్ళు ఎలా బయటపడతారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: