అమరావతి : పవన్ ట్రెండ్ సెట్ చేశారా ?

Vijaya



జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త ట్రెండ్ సెట్ చేశారా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ ఆ ట్రెండ్ ఏమిటంటే పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారి బీమా కోసం తన జేబులో నుండి పవన్ కోటి రూపాయల విరాళమిచ్చారు. ఇచ్చింది పార్టీ కార్యకర్తల బీమా పథకానికే అయినా, ఇచ్చింది సొంత పార్టీకే అయినా ఇప్పటివరకు ఏ పార్టీ అధినేత కూడా సొంతడబ్బు ఇచ్చినట్లు లేదు. ఇపుడు కోటి రూపాయలు ఇవ్వటమే కాదు గతంలో రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు.



తన సొంత డబ్బును పవన్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే నేతలు, కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. అలాగే పవన్ చిత్తశుద్దిని ఇష్టపడే నేతలు కూడా పార్టీకి భారీగా విరాళాలు ఇచ్చే అవకాశముంది. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు ఏమన్నా జరిగినా, ప్రమాదాల్లో గాయపడినా బీమా డబ్బులు కొంతవరకు ఆదుకుంటాయన్నది పవన్ ఆలోచన. ఈ పద్దతి ఇప్పటికే తెలుగుదేశంపార్టీలో అమలవుతోంది. కాకపోతే ఎంత చిత్తశుద్దితో అమలు చేస్తున్నారో తెలీదు.



తాజాగా పవన్ చెప్పిన లెక్కల ప్రకారమే పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తు మరణించిన 106 మంది కుటుంబాలకు తలా రు. 5 లక్షలు బీమా అందిందట. అలాగే గాయపడిన 180 మంది వైద్యానికి కూడా బీమా డబ్బులు అందినట్లు చెప్పారు. ఇప్పటికే మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు దాదాపు రు. 4 కోట్లను పవన్ అందించిన విషయం తెలిసిందే. ఈ డబ్బును కూడా పవన్ సొంత జేబులో నుండే ఇచ్చారు.



పార్టీ కార్యక్రమాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు ఎప్పుడూ సొంత డబ్బు ఖర్చులు చేసినట్లు వినలేదు. అలాగే పార్టీలో పనిచేస్తు మరణించిన లేదా గాయపడిన కార్యకర్తలకు సొంత డబ్బులు అందించినట్లు కూడా లేదు. ఈ విషయంలో పవన్ను అభినందించాల్సిందే. కాకపోతే ఎంతకాలమని పవన్ సొంత డబ్బులు ఖర్చులు పెడతారన్నదే అసలైన ప్రశ్న. ఇందుకోసం జనసేన ఒక పర్మినెంటు మెకానిజంను ఏర్పాటు చేసుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: