అమరావతి : బీజేపీలో మొదలైన కొత్త కుంపటి

Vijaya


ఇద్దరు నేతల మధ్య వివాదం ఏదోరకంగా ముగిసిందని అనుకోగానే మరో ఇద్దరు నేతల మధ్య కొత్త కుంపటి మొదలైనట్లే అనిపిస్తోంది. బీజేపీ చీఫ్ సోమువీర్రాజు-మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మధ్య ఎన్ని గొడవలయ్యాయో అందరికీ తెలిసిందే. చివరకు పార్టీకి కన్నా రాజీనామా చేయటంతో వాళ్ళ వివాదం అలా ముగిసింది. పార్టీలో పెద్ద వివాదం ముగిసిందని అందరు అనుకునేలోపు హఠాత్తుగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు-దగ్గుబాటి పురందేశ్వరి మధ్య గొడవ మొదలైంది.ఈమధ్య జీవీఎల్ ఎక్కువగా కాపులను భుజనేసుకుని మాట్లాడుతున్న విషయం అందరు చూస్తున్నదే. కాపుల ఓట్లకోసమే జీవీఎల్ పార్టీ లైన్ దాటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారనే టాక్ పార్టీలోనే వినిపిస్తోంది. విజయవాడ ఎయిర్ పోర్టుకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని, ఏదైనా ఒక జిల్లాకు రంగా పేరు పెట్టాల్సిందే అని జీవీఎల్ పదేపదే డిమాండ్ చేస్తున్నారు. నిజానికి జీవీఎల్ చేస్తున్న డిమాండ్లు పార్టీలో ఎప్పుడూ చర్చకు రాలేదు. అందుకనే వ్యక్తిగత హోదాలోనే ఎంపీ పై డిమాండ్లు చేస్తున్నారని పార్టీ నేతలే లైటుగా తీసుకున్నారు.రంగాను ఎంపీ భుజనేసుకుంటే ఎవరికీ ఇబ్బంది లేదుకానీ ఎప్పుడు మాట్లాడినా ఆ ఇద్దరి పేర్లేనా, ఆ ఇద్దరి గురించేనా అంటు ఎన్టీయార్, వైఎస్సార్ పేర్లను ప్రస్తావిస్తున్నారు. దాంతో దగ్గుబాటికి మండినట్లుంది. అందుకనే ఎంపీని ఉద్దేశించి చాలా ఘాటుగా స్పందించారు. ఆ ఇద్దరు..ఆ ఇద్దరు అని ఎన్టీయార్, వైఎస్సార్ గురించి మాట్లాడవద్దని ట్విట్టర్లో వార్నింగ్ ఇచ్చేశారు.
ఎన్టీయార్, వైఎస్సార్ ఆ ఇద్దరు కాదని వాళ్ళిద్దరు మహనీయులని దగ్గుబాటి కీర్తించటం జీవీఎల్ కు మింగుడుపడటంలేదు. పురందేశ్వరి ట్వీట్ చూసిన వాళ్ళకు ఎన్టీయార్, వైఎస్సార్ తో రంగాకు అసలు పోలికే లేదని చెప్పినట్లుగానే అర్ధమవుతోంది. అలాగే ఎన్టీయార్, వైఎస్సార్ గురించి మాట్లాడేపుడు జాగ్రత్తగా మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చినట్లే అనిపిస్తోంది. దాంతో మిగిలిన కమలనాదులు తాజా వివాదంతో  తలలు పట్టుకుంటున్నారు. ఎంపీయేమో  రంగాను హైలైట్ చేయాలని చూస్తుంటే పురందేశ్వరేమో ఎన్టీయార్, వైఎస్సార్ ను కీర్తిస్తున్నారు. మరి తాజా వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: