హైదరాబాద్ : ఎంపీ చాలెంజ్ చేస్తున్నారా ?

Vijaya



కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీన్ బాగా అర్దమైపోయింది. తానేం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుందనే విషయంలో క్లారిటి వచ్చినట్లుంది. అందుకనే పార్టీలో ఉంటు పార్టీ అధిష్టానాన్నే చాలెంజ్ చేసినట్లు మాట్లాడుతున్నారు. తనపై యాక్షన్ తీసుకోవాలని సవాలు విసురుతున్నట్లుంది.  తనమీద అధిష్టానం ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేందనే ధైర్యం పెరిగిపోయినట్లుంది. అందుకనే పార్టీలైన్ దాటి మరీ నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు. వచ్చేఎన్నికల తర్వాత కేసీయార్, కాంగ్రెస్ కలిసే అవకాశం ఉందని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనమైంది.



పార్టీ అగ్రనేత రాహూల్ గాంధీయే కాంగ్రెస్ కు ఎవరితోను పొత్తుండదని, ఎప్పటికీ బీఆర్ఎస్ తో కలవదని స్పష్టంగా ప్రకటించిన తర్వాత కూడా కోమటిరెడ్డి విరుద్ధంగా మాట్లాడారంటే ఏమనుకోవాలి. ఎంపీపైన క్రమశిక్షణ చర్యలు తీసుకునేంత ధైర్యం అధిష్టానం చేయటంలేదు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని అనుకుంటున్న పార్టీ, సీనియర్లు అందులోను గట్టి నేతలపై యాక్షన్ తీసుకునే పరిస్ధితిలో లేదు. అధిష్టానం నస్సహాయతే కోమటిరెడ్డికి అడ్వాంటేజ్ గా మారింది.



కోమటిరెడ్డిపై యాక్షన్ తీసుకుంటే నల్గొండ జిల్లాలో పార్టీకి దెబ్బపడటం ఖాయమని అధిష్టానం ఆందోళన పడుతోంది. లేకపోతే ఎప్పుడో ఎంపీపైన యాక్షన్ తీసుకునుండేదే. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక సమయంలో పార్టీ ఓడిపోతుందని చెప్పినపుడే ఎంపీపైన యాక్షన్ తీసుకునుండాల్సింది. అప్పుడే ఏమీ యాక్షన్ తీసుకోని అధిష్టానం ఇపుడేమి తీసుకుంటుంది. ఎంపీ పద్దతి ఎలాగుందంటే పార్టీని వదిలేసి దెబ్బకొట్టడం కన్నా పార్టీలోనే ఉంటు నాశనం చేయటం తేలికని అనుకున్నట్లున్నారు.



బహుశా ఎన్నికల వరకు ఎంపీ వ్యవహారం ఇలాగే కంటిన్యు అవుతుందేమో. లేకపోతే ఉదయం మీడియా సమావేశంలో పార్టీకి డ్యామేజ్ జరిగేట్లు  నోటికొచ్చింది మాట్లాడేసి సాయంత్రానికి తాను అలా మాట్లాడలేదని, తన మాటలను వక్రీకరించారని ఎదురుదాడి చేయటం ఏమిటి ? మాట్లాడింది మాట్లాడినట్లు ఆడియో, వీడియో విజువల్స్ అంత స్పష్టంగా ఉన్నా ఎంపీ బుకాయించటమే ఆశ్చర్యంగా ఉంది. ముందు ముందు ఎంపీ నుండి మరిన్ని డ్యామేజింగ్ ప్రకటనలు రావచ్చు. తనపై యాక్షన్ తీసుకునే సీన్ అధిష్టానానికి లేదని అర్ధమైన తర్వాత ఆకాశమే హద్దుగా రెచ్చిపోకుండా ఉంటారా ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: