హైదరాబాద్ : గవర్నర్ దెబ్బకు తోకముడిచిన కేసీయార్

Vijaya


గవర్నర్ దెబ్బకు కేసీయార్ తోకముడిచారనే అనుకోవాలి. గడచిన రెండు బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే కేసీయార్ మొదలుపెట్టి ముగించేశారు. ఇపుడు ఫిబ్రవరి 3వ తేదీన మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లో కూడా గవర్నర్ ఊసేలేకుండా చేయాలని అనుకున్నారు. ఆమోదంకోసం పంపిన ద్రవ్య వినిమయ బిల్లును గవర్నర్ తొక్కిపెట్టారు. బడ్జెట్ సమావేశంలో తన ప్రసంగం ఉంటుందా ఉండదా చెప్పమని అడిగారు. దానికి ఏమి సమాధానం చెప్పలేక ప్రభుత్వం తెల్లమొహమేసింది. ద్రవ్యవినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం లేకపోతే బడ్జెట్ పాస్ కాదు.దాంతో ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం రాదని అర్ధమైపోయిన ప్రభుత్వం వెంటనే గవర్నర్ కు వ్యతిరేకంగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఇక్కడే అసలైన సమస్య మొదలైంది. అదేమిటంటే గవర్నర్ ను హైకోర్టు ఆదేశించగలదా ? గవర్నర్ ను ఆదేశించే అధికారం హైకోర్టుకుందా ? అన్నదే అసలైన పాయింట్. ఎందుకంటే రాష్ట్రంలో అత్యున్నత స్ధానం గవర్నర్ దే.  హైకోర్టు చీఫ్ జస్టిస్ తో కూడా ప్రమాణస్వీకరం చేయించేది గవర్నరే. అంటే చీఫ్ జస్టిస్ కు కూడా గవర్నరే బాస్ అని అర్ధమవుతోంది.మరలాంటపుడు బాస్ ను కోర్టు మాత్రం ఎలా శాసించగలదు ? ఇక్కడే కేసీయార్ కు సమస్య మొదలైంది. ఇదే సమయంలో హైకోర్టు కాస్త లౌక్యంగా వ్యవహరించింది. ఘర్షణ వాతావరణం ముదరకుండానే ప్రభుత్వం తరపు లాయర్, రాజ్ భవన్ తరపు న్యాయవాది ఇద్దరిని మాట్లాడుకోమని చీఫ్ జస్టిస్ సలహా ఇచ్చారు.ఇద్దరు లాయర్లు కూర్చుని రాజ్యాంగ పరిధి, అధికారాలు తదితరాలను మాట్లాడుకున్నారు. గవర్నర్ సంతకం లేనిదే ఏమీ జరగదని అర్ధమైపోయినట్లుంది. అందుకనే ప్రభుత్వ లాయర్ వెంటనే ఇదే విషయాన్ని కేసీయార్ కు స్పష్టంచేశారు. చేసేదిలేక కేసీయార్ కూడా ఓకే చెప్పారు. దాంతో గవర్నర్ కు వ్యతిరేకంగా దాఖలు చేసిన లంచ్ మోషన్ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇదే సమయంలో బడ్జెట్ సమావేశం  గవర్నర్ ప్రసంగంతోనే మొదలవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అంటే రాజ్యాంగ వ్యవస్ధల మధ్య ఘర్షణ వాతావరణం లేకుండానే సమస్య పరిష్కారమైంది. మొదటి రెండు బడ్జెట్ సమావేశాలకు  ఆమోదం తెలిపిన గవర్నర్ మూడో సమావేశంలో పట్టు బిగించగానే కేసీయార్ విలవిల్లాడిపోయి తగ్గాల్సొచ్చింది.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: