అమరావతి : జనసేన విషయంలో ప్రచారం నిజమేనా ?

Vijayaమూడు రోజుల క్రితం చంద్రబాబునాయుడు-పవన్ కల్యాణ్ భేటీఅయిన దగ్గర నుండి ఓ విషయం మీడియాతో పాటు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే రాబోయే ఎన్నికల్లో జనసేనకు చంద్రబాబు 24 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లు ఇవ్వటానికి అంగీకరించారని. అయితే ఇదే సమయంలో అదేంకాదు 25 అసెంబ్లీ, 3 లోక్ సీట్లు ఇవ్వటానికి చంద్రబాబు ఓకే చెప్పారనేది రెండో విషయం.పరామర్శ అనేది పేరుకు కానీ అసలు విషయం సీట్ల పొత్తుగురించి మాట్లాడుకున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. ఇందులో నిజమెంతో చంద్రబాబు లేదా పవనే చెప్పాలి మరి. అయితే ఎన్నికలకు ముందు మిత్రపక్షమైన బీజేపీని వదిలేసి పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారనే అందరు అనుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీ మిత్రపక్షమనే కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి చేసిన కార్యక్రమం ఒక్కటికూడా లేదు. పొత్తు పెట్టుకున్న రోజునుండి ఇప్పటివరకు రెండుపార్టీలు అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నాయి.జనసేనకు చంద్రబాబు ఇస్తానన్న అసెంబ్లీ నియోజకవర్గాల జాబితా కూడా చక్కర్లు కొడుతోంది. దీనిప్రకారం రాయలసీమలో తిరుపతి, చిత్తూరు, అనంతపురం అర్బన్, పుట్టపర్తి ఉన్నాయి. అలాగే ఉత్తరాంధ్రలో ఐదు నియోజకవర్గాలున్నాయి. అవేమిటంటే గాజువాక, చోడవరం, విశాఖ ఉత్తరం, భీమిలీ, యలమంచిలి. ఉభయగోదావరి జిల్లాల్లో ఏడు నియోజకవర్గాలున్నాయట. అవేమిటంటే రాజానగరం, అమలాపురం, రాజోలు, కాకినాడ రూరల్, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం.
ఇక కోస్తా జిల్లాల్లో కైకలూరు, తెనాలి, విజయవాడ ఫశ్చిమం, సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమం, గిద్దలూరు, దర్శి, చీరాల నియోజకవర్గాలున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా బాగా జరుగుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఇపుడు జరుగుతున్న ప్రచారం నిజమే అయితే పవన్ కు ఒకరకంగా రాజకీయంగా ఆత్మహత్యగానే చెప్పాలి. 24 లేదా 25 సీట్లు గనుక తీసుకుని టీడీపీ పొత్తుతో ఎన్నికలకు వెళితే కాపులు పవన్ను ఆమోదించరు. పైగా ఈ సీట్లతో పవన్ సీఎం అయ్యేది కలలో కూడా జరగదు. ఇంతోటిదానికి తాము చంద్రబాబు పల్లకీని ఎందుకు మోయాలని కాపులడిగితే పవన్ ఏమి సమాధానం చెబుతారు ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: