ఉత్తరాంధ్ర : ధర్మాన కొత్త సెంటిమెంటు రాజేస్తున్నారా ?

Vijaya


‘చేస్తే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ గా చేయాలి లేదంటే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలి’..ఇది తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన డిమాండ్. చంద్రబాబునాయుడు అమరావతి రాజధాని డిమాండుకు కౌంటరుగా ధర్మాన కొత్త డిమాండ్ ను వినిపించారు. రాష్ట్రం  సమైక్యంగా ఉన్నపుడు అందరు కష్టపడి రాజధానిగా హైదరాబాద్ ను డెవలప్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పాలకులు కూడా అభివృద్ధిలో ఎక్కువ భాగాన్ని హైదరాబాద్ చుట్టుపక్కలే చేసినట్లు చెప్పారు.



రాష్ట్ర విభజన జరిగినపుడు బాగా డెవలప్ అయిన హైదరాబాద్ తెలంగాణాకు వెళిపోవటంతో ఏపీలో ఇబ్బందులు మొదలైనట్లు మంత్రి వివరించారు. ఏపీ మరోసారి నష్టపోకూడదంటే కచ్చితంగా పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందే అని గట్టిగా డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో మళ్ళీ అమరావతి కేంద్రంగానే డెవలప్మెంట్ కు బీజాలు పడిన విషయాన్ని గుర్తుచేశారు.  అందుకనే టీడీపీ ఘోరంగా ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినట్లు చెప్పారు.



జనాల ఆకాంక్షలకు అనుగుణంగా జగన్ మూడురాజధానుల కాన్సెప్టును ప్రకటిస్తే చంద్రబాబు అండ్ కో అడుగడుగునా అడ్డుకుంటున్నట్లు మండిపోయారు. జగన్ కాన్సెప్టు వర్కవుట్ కాకపోతే ఏపీకి తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపధ్యంలోనే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని జనాలంతా డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ అది సాధ్యంకాకపోతే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాల్సిందే అని కొత్త డిమాండును తెరపైకి తెచ్చారు.



ధర్మాన డిమాండ్ వల్ల ఉత్తరాంధ్రలో సెంటిమెంటు రాజుకునే అవకాశాలు కనబడుతున్నాయి. సెంటిమెంటును రాజేయటం ఈజీనే కానీ దాన్ని చల్లార్చటమే చాలా కష్టం. ధర్మాన కారణంగా సెంటిమెంటు రాజుకుంటే వచ్చేఎన్నికల నాటికి ఉత్తరాంధ్రలో రాజకీయాలు ఎలాగుంటాయో ఎవరు చెప్పలేరు. అసలు ధర్మాన డిమాండ్ ఆచరణ సాధ్యమేనా ? ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఉన్నదే మూడు ఉమ్మడి జిల్లాలు. విశాఖ కేంద్రంగా కొత్త రాష్ట్రమంటే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలను కూడా కలపమంటారేమో తెలీదు. ఏదేమైనా వేర్పాటు వాదంతో అభివృద్ధి దెబ్బతినటం వాస్తవం. మరి ధర్మాన కొత్త డిమాండ్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: