బీజింగ్ : ప్రపంచదేశాలపై మరోసారి డ్రాగన్ పంజా ?

Vijaya





ప్రపంచదేశాలపై డ్రాగన్ తన పంజాను మరోసారి విసురుతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కరోనా వైరస్ రూపంలో చైనా తన పంజాను మరోసారి విసురుతోందనే టెన్షన్ పెరిగిపోతోంది. థర్డ్ వేవ్ తోనే కరోనా వైరస్ అంతమైపోయిందని ప్రపంచదేశాలు గట్టిగా నమ్మాయి. కానీ తాజాగా ఫోర్త్ వేవ్ మొదలైపోయిందనే వార్తలు ప్రపంచదేశాలను టెన్షన్లో ముంచెత్తేస్తున్నది.



అమెరికా, చైనా, కొరియా, జపాన్, బ్రెజిల్ దేశాల్లో కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. ఈ ఐదుదేశాల్లోనే గడచిన వారంలో సుమారు 35 లక్షల కేసులు నమోదయ్యాయంటేనే దాని తీవ్రత అర్ధమైపోతోంది. కేసుల ఉధృతి చూసిన తర్వాత ప్రపంచదేశాలు కచ్చితంగా నాలుగో వేవ్ ను ఎదుర్కోక తప్పదని అదికూడా చాలా వేగంగా విస్తరిస్తుందనే అంచనాకు వచ్చేస్తున్నాయి. అందుకనే ఐక్య రాజ్యసమితి అన్నీ దేశాలకు కరోనా అలర్ట్ ప్రకటించింది.



వైరస్ కు పుట్టిల్లయిన చైనాలో మళ్ళీ కేసులు విపరీతంగా విజృంభిస్తున్నాయి. అయితే అధికారికంగా చైనా ఏమీ చెప్పటంలేదు. ఒకవేళ కేసుల సంఖ్యను చెప్పినా చాల తక్కువచేసి చూపిస్తోంది ఎప్పటిలాగే. కరోనా ఆంక్షలు ఎత్తేసిన దగ్గర నుండి ప్రతిరోజు చైనాలో వేలాది కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిరోజు వందలమంది రోగులు చనిపోతున్నారు. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా చాలామందిని చేర్చుకునే అవకాశం లేక పంపేస్తున్నారు. ఇదేసమయంలో శ్మశానాల దగ్గర శవాలు గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్నాయి.



డ్రాగన్ దేశంలో రోజుకు తక్కువలో తక్కువ 50 వేల కేసులు వెలుగుచూస్తున్నా ప్రభుత్వం మాత్రం చాలా తక్కువే చూపుతోంది. స్ధానికంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నెటిజన్లు అప్ లోడ్ చేస్తున్న ఆసుపత్రుల ఫొటోలు, వీడియోలు, శ్మశనాల దగ్గర శవాల వీడియోల కారణంగా వాస్తవ పరిస్ధితులను ప్రపంచదేశాలు అంచనాలు వేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే మనదేశంలో కూడా కేంద్రం అలర్ట్ ప్రకటించింది. కాబట్టి ప్రపంచదేశాలను ఫోర్త్ వేవ్ వణికించేయటం ఖాయమని శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనాలంతా ముందస్తు జాగ్రత్తలు తీసుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. మరీ ఫోర్త్ వేవ్ ఎంత ప్రభావాన్ని చూపుతుందో ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: