హైదరాబాద్ : బీజేపీకి 90 సీట్లు ఖాయమట...నిజమేనా ?

Vijaya


వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీకి 90 సీట్లు రావటం ఖాయమని పార్టీ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ జోస్యం చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయంమాత్రం బీజేపీదే అని చుగ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. పార్టీ పాధాదికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతు పార్టీ చేయించుకున్న సర్వే వివరాలను పంచుకున్నారు. పార్టీ తరపున పోటీచేసే అభ్యర్ధులు ఎవరో కూడా ప్రకటించకపోయినా 78 నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమని సర్వేలో తేలిందట.



అభ్యర్ధులు ఎవరో ప్రకటించకపోయినా 78 సీట్లలో గెలుపు ఖాయమంటే ఇక అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత అదనంగా మరో 12 సీట్లలో గెలుపుతో పార్టీకి 90 సీట్లు ఖాయమన్నారు. ఈ విషయం కేసీయార్ కు తెలియటం వల్లే ఆయనలో వణుకు పెరిగిపోతున్నట్లు చుగ్ చెప్పారు. అయితే ఇక్కడే చుగ్ ముందుచెప్పిన సర్వే రిపోర్టుకు విరుద్ధంగా మాట్లాడారు. సమావేశం చివరలో మాట్లాడుతు తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు చెప్పారు. ఒకవైపేమో 90 సీట్లు ఖాయమని చెబుతునే మరోవైపు అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పటం ఏమిటో అర్ధంకావటంలేదు.



అధికారంలోకి రావటం ఖాయమని చెప్పటానికి, అధికారంలోకి వచ్చేఅవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పటానికి చాలా తేడావుంది. చుగ్ మాటలను పక్కనపెట్టేస్తే  పార్టీ నేతల సమాచారం ప్రకారం పట్టుమని 25 నియోజకవర్గాల్లో కూడా గట్టి అభ్యర్ధులు లేరట. 119 నియోజకవర్గాల్లో 25 చోట్ల కూడా గట్టి అభ్యర్ధులు లేని పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందంటే ఎవరైనా నమ్ముతారా ? ఇప్పటికిప్పుడు ఎన్నికలని కేసీయార్ చెబితే బీజేపీ పని గోవిందాయే.




అన్నీ నియోజకవర్గాల్లోను గట్టి అభ్యర్ధులు దొరక్కే కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీలను ఎంఎల్ఏలుగా పోటీచేయాలని అగ్రనేతలు సూచించినట్లు తెలుస్తోంది. పనిలోపనిగా ఇతర పార్టీల్లోని నేతలను చేర్చుకోవటంలో అసలు ఉద్దేశ్యం కూడా ఇదే. ఇతరపార్టీల్లోని నేతలను చేర్చుకుంటే కానీ 119 నియోజకవర్గాల్లో అభ్యర్ధులుండరు. గట్టి అభ్యర్ధులులేని బీజేపీకి 90 సీట్లొచ్చేస్తాయని చుగ్ చెబితే అసలు కమలనాదలన్నా నమ్ముతారా ?




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: