హైదరాబాద్ : మార్గదర్శి అడ్డంగా దొరికినట్లేనా ?

Vijaya




మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్ధ యాజమాన్యం అడ్డంగా దొరికినట్లేనా ? బుధవారం మధ్యాహ్నం చిట్ ఫండ్స్ సంస్ధ కార్యాలయంలో తనిఖీలకు ఏపీ స్టాంప్స్ అండ్  రిజిస్ట్రేషన్స్ శాఖ ఉన్నతాధికారులు తనిఖీలకు వెళ్ళారు. హైదరాబాద్ సోమాజీగూడలోని హెడ్ ఆఫీసుకు వెళ్ళారు కానీ అక్కడివాళ్ళు అధికారులకు పెద్దగా సహకరించలేదట. ఏ ఫైలు చూపించమని అడిగినా చూపించలేదని తెలిసింది. ఇంతకుముందు జరిగిన తనిఖీల్లో కూడా సిబ్బంది సహాయనిరాకరణ చేసిన విషయం అందరికీ తెలిసిందే.



రాష్ట్రంలో మార్గదర్శికి 18 బ్రాంచీల్లో ఉన్నతాధికారులు తనిఖీలు చేసినా ఎక్కడ కూడా సిబ్బంది సహకరించలేదు. అధికారులు అడిగిన సమాచారం ఏదీ ఇవ్వలేదు. ఏమడిగినా అంతా హెడ్డాఫీసులో దొరుకుతుందనే నిర్లక్ష్యపు సమాధానాలే చెప్పారు. ఇదే విషయాన్ని తనిఖీల తర్వాత ఐజీ రామకృష్ణ మీడియాతో చెప్పారు. అయితే రామకృష్ణ చెప్పింది తప్పన్నట్లుగా యాజమాన్యం సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నది. తమ సిబ్బంది అధికారులకు సహకరించారని, అడిగిన సమాచారం అంతా అందించారని చెప్పుకున్నది.



తమకు వ్యతిరేకంగా ప్రభుత్వం కుట్రచేస్తోందని, ఖాతాదారుల్లో తమకున్న విశ్వసనీయతను దెబ్బతీయటానికే ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందంటు యాజమాన్యం అడ్వర్వ్టైజ్మెంట్లో చెప్పుకున్నది. అయితే దాన్ని తర్వాత రామకృష్ణ ఖండించారు. మార్గదర్శిలో తాము భారీ అవకతవకలను గుర్తించామని, వందల కోట్లరూపాయలు దారిమళ్ళినట్లు గుర్తించిన విషయాన్ని బయటపెట్టారు. ఆ విషయాలకు సంబంధించిన ఫైళ్ళు అడిగితే ఇవ్వలేదన్నారు.



సరే అదంతా చరిత్రగా అనుకుంటే మరి హెడ్ ఆపీసులో జరిపిన తనిఖీల సమయంలో కూడా సహకరించటంలేదనే అంటున్నారు. మార్గదర్శి యాజమాన్యం ఫండ్స్ విషయంలో ఎలాంటి తప్పులు చేయకపోతే అధికారులు అడిగిన ఫైళ్ళను ఎందుకు చూపించటంలేదన్నది పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం చెప్పమంటే యాజమాన్యం స్పష్టంగా  చెప్పటంలేదు. నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్ధ వ్యాపారం చేస్తోందని మొదటినుండి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పదేపదే ఆరోపిస్తున్నారు. మళ్ళీ ఆ విషయంలో మాత్రం యాజమాన్యం అసలు నోరేవిప్పటంలేదు. ఏదేమైనా తాజా తనిఖీల్లో యాజమాన్యం బండారమంతా బయటపడినట్లే అనుకుంటున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: