అమరావతి : చంద్రబాబుకు ఆ మూడు పార్టీలే దిక్కా ?

Vijaya



ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు చివరకు ఆ మూడుపార్టీలే దిక్కయ్యేట్లున్నాయి. ఇంతకీ ఆ మూడుపార్టీలు ఏవంటే కాంగ్రెస్, వామపక్షాలైన సీపీఐ, సీపీఎం మాత్రమే. ఎన్నికల సమయానికి ఏమవుతుందో తెలీదుకానీ ఇప్పటికైతే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేరుపడినట్లే. బీజేపీ మొదటినుండి చంద్రబాబును వ్యతిరేకిస్తునే ఉన్నది. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక పోరాటంలో భాగంగా జనసేనతో పాటు బీజేపీని కూడా కలుపుకుని వెళ్ళాలని చంద్రబాబు ప్లాన్ చేస్తే చివరకు చేతిలో ఉన్న పవన్ కూడా జారిపోయారు.




తొందరలోనే తనతో కలిసొచ్చే పార్టీలేవో నిర్ధారణ చేసుకునే విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదపబోతున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ వ్యూహమేంటంటే అమరావతి ప్రాంతంలోనే అమరావతికి మద్దతుగా ఒక భారీ బహిరంగసభ నిర్వహించాలని అనుకున్నారట. వైసీపీ మినహా అన్నీపార్టీలకు ఇన్విటేషన్లు పంపాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట. ఇందులో బీజేపీ, జనసేన కూడా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.



బహిరంగసభకు హాజరయ్యే విషయంలో ఇప్పటికే కాంగ్రెస్, వామపక్షాల నేతలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాబట్టి బీజేపీ, జనసేన విషయంలోనే అయోమయం కంటిన్యు అవుతోంది. తాజా డెవలప్మెంట్ల ప్రకారంచూస్తే బీజేపీ, జనసేన హాజరయ్యే అవకాశంలేదనే అనిపిస్తోంది. విషయం ఏదైనా నూరుశాతం అడ్వాంటేజ్ తీసుకోవటమే చంద్రబాబు టార్గెట్ కదా కాబట్టి ఇన్విటేషన్లను అందరికీ పంపించబోతున్నారు. ఇన్విటేషన్లను పంపటంలో మరో ప్లాన్ కూడా అంతర్లీనంగా దాగుంది.




అదేమిటంటే అమరావతికి ఎవరు అనుకూలం, ఎవరు వ్యతిరేకమో తేలిపోవటం. బహిరంగసభకు హాజరయ్యే పార్టీలు అమరావతికి అనుకూలమని, హాజరుకాని పార్టీలు వ్యతిరేకమని చంద్రబాబు ముద్ర వేయబోతున్నారు. అంతాబాగానే ఉందికానీ అమరావతికి వ్యతిరేకం, అనుకూలమనే ముద్ర వేయటం ద్వారా చంద్రబాబు ఏమి సాధించబోతున్నారు అనేదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే అమరావతికి అనుకూలమని ముద్రపడితే మరి మిగిలిన ప్రాంతాల్లోని జనాలు సదరు పార్టీ విషయంలో ఏ విధంగా స్పందిస్తారనే ప్రశ్న కూడా కీలకమే కదా. ఏదేమైనా చంద్రబాబుకు మొదట్లో చెప్పుకున్న మూడుపార్టీలు మాత్రమే మద్దతుగా నిలిచేట్లున్నాయి. కాకపోతే వాటికి ఉన్న బలమెంత ? ఓటుబ్యాంకెంత అన్న విషయాలను మాత్రం అడక్కూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: