అమరావతి : జగన్ వ్యూహం ఫలిస్తుందా ?

Vijaya



మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ గెలుచుకున్న 23 నియోజకవర్గాలను కూడా వచ్చే ఎన్నికల్లో గెలుచుకోవాలన్నది జగన్మోహన్ రెడ్డి టార్గెట్. అంటే వైసీపీ గెలిచిన 151, జనసేన గెలిచిన 1, టీడీపీ విజయం సాధించిన 23 కలిపి 175 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నారు. ఇందుకోసం జగన్ గట్టి ఫౌండేషనే వేస్తున్నారు.  టార్గెట్ రీచవ్వటం జగన్ కు సాధ్యమవుతుందా లేదా అన్నది పక్కనపెట్టేస్తే అందుకు ప్రయత్నాలను మాత్రం గట్టిగానే చేస్తున్నారు.


 
టీడీపీ గెలిచిన సీట్లలో కూడా వైసీపీనే గెలవాలంటే ఏమిచేయాలి ? 2014-19  మధ్య చంద్రబాబునాయుడు వ్యవహరించినట్లుగా వ్యవహరించకూడదని జగన్ అనుకున్నారు. అప్పట్లో వైసీపీ ఎంఎల్ఏలు గెలిచిన నియోజకవర్గాల్లో అభివృద్ధిపనులు చేసేదిలేదని చంద్రబాబు బహిరంగంగానే చెప్పారు. కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. జిల్లాకు వచ్చిన చంద్రబాబును పాణ్యం ఎంఎల్ఏ గౌరుచరితారెడ్డి కలిసి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించాలని రిక్వెస్టుచేశారు.



అయితే రోడ్డుషోలో మాట్లాడిన చంద్రబాబు ప్రతిపక్షాలు గెలిచిన నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసేదిలేదని స్పష్టంగా ప్రకటించారు. ఎక్కడ పర్యటించినా చంద్రబాబు ఇలాగే మాట్లాడినందుకు తర్వాత ఎన్నికల్లో ఫలితం ఏమిటో అందరికీ తెలిసిందే. ఇక్కడే జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబులాగ కాకుండా అన్నీ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారు. సంక్షేమపథకాలు అమలుచేయటంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు మంజూరు చేస్తున్నారు. కుప్పం మున్సిపాలిటికి మొన్ననే రు. 65 కోట్లు మంజూరుచేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిద్యం వహిస్తున్న టెక్కలిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటివరకు రు. 1024 కోట్లు విడుదలచేశారు.


 
ఇక ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గానికి గొట్టిపాటిరవికుమార్ ప్రతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ప్రభుత్వం రు. 1081 కోట్లు వ్యయంచేసింది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో మూడున్నరేళ్ళల్లో రు. 946 కోట్లు ఖర్చుచేసింది. ఇదే పద్దతిలో టీడీపీ గెలిచిన సీట్ల విషయంలో వివక్షచూపకుండా వీలైనన్ని నిధులు ఖర్చు చేస్తున్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్నాం కాబట్టే మనకు 175కి 175 సీట్లు ఎందుకు రావంటు జగన్ పదేపదే ప్రశ్నిస్తున్నారు. మరి గెలుస్తారా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: