అరుణాచల్ ప్రదేశ్: మరోసారి చైనా రెచ్చగొట్టే చర్యలు?

Purushottham Vinay
భారతదేశపు ఈశాన్య రాష్ట్రం అయిన అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటి నుంచో తమదేనంటూ.. ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా చైనీస్ పేరు కూడా పెట్టిన  డ్రాగన్ కంట్రీ చైనా తన వక్ర బుద్ధులను అస్సలు మార్చుకోవడం లేదు.ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో ఇండియా - చైనా మధ్య వాస్తవాధీన రేఖకు సమీపంలో చైనా భూభాగంలో గ్రామాలకు గ్రామాలే నిర్మించి చైనా పౌరులను తరలించింది. ఈ చిత్రాలు నాసా చిత్రాల్లోనూ భారత ఉపగ్రహ చిత్రాల్లోనూ స్పష్టంగా కనిపించాయి. అంతకుముందు వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవని.. ఈ మధ్య కాలంలోనే వాటిని నిర్మించిందని వార్తలు వచ్చాయి.దీనిపై భారత్ ఎప్పటికప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ చైనా పెడచెవిన పెడుతూనే ఉంది. అంతేకాకుండా తాజాగా మరోమారు భారత్ను రెచ్చగొట్టే చర్యలకు దిగింది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని అంజా జిల్లాకు సమీపంలోని చాగ్లాగాంకు అతి దగ్గరలో హడీగరా-డెల్టా6 వద్ద ఒక హెలీప్యాడ్ను చైనా నిర్మిస్తోంది. చైనా సైన్యం.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) కోసం ఈ హెలీప్యాడ్ను నిర్మిస్తోందని అరుణాచల్ ప్రదేశ్లోని స్థానిక ఆంగ్ల వార్తాపత్రిక ఒక ఆర్టికల్ ని ప్రచురించింది. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇంత జరుగుతున్నా మరోవైపు ఎప్పటిలానే భారత రక్షణ వర్గాలు ఈ వార్తల్ని తోసిపుచ్చడం గమనార్హం.


ఆ నిర్మాణం చైనా భూభాగంలో ఉందని రక్షణ శాఖ తెలిపింది. సదరు ఫొటోలు వీడియోలు చైనా భూభాగానికే సంబంధించినవేనని పేర్కొంది. ఆ హెలీప్యాడ్ నిర్మాణం అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతున్నది కాదని భారత రక్షణ శాఖ వెల్లడించింది.కాగా అరుణాచల్ ప్రదేశ్లో చైనా దురాక్రమణ గురించి వస్తున్న వార్తలు నిజమైతే.. వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో చైనాతో భారత్ విధానం గురించి స్పష్టం చేయాలని ఆయన కోరారు.చైనా బుల్డోజర్లు మన భూభాగంలోకి ప్రవేశించినా కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యపై నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటి వరకూ 14 నుంచి 15 దఫాల్లో చైనాతో చర్చలు జరిపిందని గుర్తు చేశారు. చైనాతో మనకు యుద్ధం ఎప్పుడైనా రావచ్చు. అలా జరగకూడదనే కోరుకుంటున్నానన్నారు. ప్రధాని మోదీ వెంటనే చైనా సమస్యపై స్పష్టతనివ్వాలి అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: