హైదరాబాద్ : మునుగోడు విషయంలో బీజేపీ తప్పుచేసిందా ?

Vijaya






తాను చేసిన తప్పుఏమిటో బీజేపీకి ఇప్పుడు తెలిసినట్లుంది. అందుకనే నాలుక్కరుచుకుని మళ్ళీ ఇంకో ప్రయత్నం చేస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే నల్గొండ జిల్లాలోనే మరో ఎంఎల్ఏని పార్టీలో చేర్చుకుని రాజీనామా చేయించి ఉపఎన్నిక తెప్పించాలని ఇపుడు మళ్ళీ ప్లాన్ చేస్తోందని సమాచారం. అసలు బీజేపీ చేసిన తప్పేమిటి ? చేసిన తప్పును తెలుసుకోవటం ఏమిటి ?



చేసిన తప్పుఏమిటంటే మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి విషయంలో తొందరపడటమే. బీజేపీ టార్గెట్ ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో కేసీయార్ ను దెబ్బకొట్టి అధికారంలోకి రావటం. కేసీయార్ మీద జనాల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోతోందని రుజువుచేయాలని అనుకున్నది. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అధికారం తమదే అని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. మరలాంటపుడు కమలంపార్టీ నేతలు ఏమిచేయాలి ?



టీఆర్ఎస్ ఎంఎల్ఏని ఆకర్షించి సదరు ఎంఎల్ఏని పార్టీలో చేర్చుకుని రాజీనామా చేయించి ఉపఎన్నిక తెప్పించాలి. ఆ ఉపఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ ను దెబ్బకొట్టి బీజేపీ గెలిస్తే కేసీయార్ పై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని, రేపటి ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తామేని జనాలందరికీ చాటిచెప్పినట్లవుతుంది. కానీ ఇపుడు బీజేపీ చేసిందేమిటి ? కాంగ్రెస్ ఎంఎల్ఏ రాజగోపాలరెడ్డిని పార్టీలోకి లాక్కుంటోంది. ఎంఎల్ఏగా రాజీనామాచేయించి ఉపఎన్నిక తెప్పించింది. ఈ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారో తెలీదు.




ఒకవేళ ఉపఎన్నికలో బీజేపీ గెలిస్తే ఏమవుతుంది ? కేసీయార్ ప్రభుత్వం మీద జనాల్లో వ్యతిరేకత ఉన్నట్లు ఎలా రుజువవుతుంది ? సీటు కాంగ్రెస్ ది కాబట్టి ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్ లో ఎవరు గెలిచినా కాంగ్రెస్ మీద జనాల్లో వ్యతిరేకత ఉన్నట్లు మాత్రమే రుజువవుతుంది ? తనదికానీ సీటును టీఆర్ఎస్ గెలిస్తే బోనస్ గా మరోసీటు వచ్చినట్లవుతుంది. ఒకవేళ ఓడిపోయినా సీటు తనది కాదుకాబట్టి టీఆర్ఎస్ కు జరిగే డ్యామేజీ ఏమీలేదు. అదే బీజేపీ ఓడిపోతే వ్యక్తిగతంగా రాజగోపాలరెడ్డికి నష్టంతో పాటు పార్టీగా బీజేపీని కూడా జనాలు తిరస్కరించారనే ప్రచారం పెరిగిపోతుంది. అందుకనే చేసిన తప్పును దిద్దుకునేందుకు మరో టీఆర్ఎస్ ఎంఎల్ఏని వెతుకుతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: