సొంత నియోజకవర్గంలో అంబటి బెండు తీశారా..?

Deekshitha Reddy
మంత్రి అంబటి రాంబాబు ఆ మీడియా సంస్థలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దుష్టచతుష్టయానికి శునకానందం అంటూ మండిపడ్డారు. తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంపై అసత్య ప్రచారం చేస్తున్నారని, లేనిది ఉన్నట్టు కల్పించి వార్తలు ఇస్తున్నారని అన్నారు. ఎల్లో మీడియా ఛానెళ్లు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు అంబటి..
అసలేం జరిగిందంటే..?
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం గ్రామంలో మంత్రి అంబటి రాంబాబు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ చిన్న గొడవ జరిగింది. ఇద్దరు వ్యక్తులు మంత్రిని నిలదీశారు. అయితే ఇదంతా పక్కా ప్లాన్ తో జరిగిందని అంటున్నారు మంత్రి అంబటి. ఎల్లో మీడియా ఛానెళ్లు.. వారిని రెచ్చగొట్టి రాద్ధాంతం చేశాయని, ఆ తర్వాత పదే పదే అవే దృశ్యాలని కావాలని ప్రసారం చేశాయని అంటున్నారు. తనపై మహిళలు తిరగబడ్డారంటూ కొన్ని మీడియా ఛానళ్లలో కథనాలు రావడాన్ని మంత్రి అంబటి రాంబాబు తప్పుబట్టారు. కొన్ని వెబ్ సైట్లలో సైతం తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. అంబటి రాంబాబును మహిళలు నిలదీశారని, బెండు తీశారని కొన్ని కథనాలు ప్రసారం అయ్యాయని, తన సొంత నియోజకవర్గంలో తన బెండు తీయడమేంటని ఆయన ప్రశ్నించారు. అలా ప్రసారం చేసుకునేవారు శునకానందం పొందుతున్నారని అన్నారు అంబటి.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాజుపాలెం గ్రామంలో 375 ఇళ్లు తిరిగానని చెబుతున్నారు అంబటి. అర్హులగకు రేషన్ కార్డులు, పింఛన్లు పంపిణీ చేశానని చెప్పారు. టీడీపీకి చెందిన ఒక వ్యక్తి, జనసేనకు చెందిన మరో వ్యక్తి మాత్రం ఆ కార్యక్రమంలో గొడవ చేయడానికి సిద్ధమయ్యారని, తనను అభాసుపాలు చేసే ప్రయత్నానికి ఒడికట్టారని అన్నారు. ఎల్లో మీడియా ఛానెళ్ల వారు వారిని రెచ్చగొట్టారని అన్నారు. గడప గడప కార్యక్రమంలో పెద్ద గొడవ జరగలేదని, తన బెండు తీయడం జరగలేదని ఓ వీడియో విడుదల చేశారు అంబటి. తన సొంత నియోజకవర్గంలో తన బెండు తీసే పరిస్థితి ఉండదని చెప్పారు. చిత్తశుద్ధితో పాలన కొనసాగిస్తున్న తమకు అలాంటి అనుభవాలు ఎదురు కావన్నారు. ఈ సందర్భంగా దుష్ట చతుష్టయానికి ధన్యవాదాలు అని అన్నారు రాంబాబు. తన కోసం స్పేస్ కేటాయించినందుకు వారికి థ్యాంక్స్ అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: