పవన్ కల్యాణ్ పై కొడాలి మార్క్ పంచ్ లు..

Deekshitha Reddy
ఏపీలో రోడ్లపై గుంతలు ఉన్నాయంటూ జనసేన మొదలు పెట్టిన గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమంపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రోడ్లపై గుంతలున్నాయంటూ జనసేన చేస్తున్న కార్యక్రమాన్ని ఆయన తప్పుబట్టారు. అసలు భారత్ లో గుంతలు లేని రోడ్లు ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో కూడా రోడ్లు గుంతలు తేలి ఉన్నాయని చెప్పారు. పవన్ కల్యాణ్ కి ఆయన సవాల్ విసిరారు. పక్క రాష్ట్రానికి వెళ్దాం గుంతలు లేని రోడ్లు కనపడితే తాను రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు, తానే కాదు సీఎం జగన్ కూడా రాజకీయాలనుంచి తప్పుకుంటారన్నారు. పక్క రాష్ట్రాల్లో రోడ్లపై గుంతలు ఉంటే చంద్రబాబు, లోకేష్, పవన్ రాజకీయాలనుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు.
భారత్ లో ఎక్కడ ఏ రోడ్లు చూసినా 10 నుంచి 20 శాతం రోడ్లపై సహజంగానే గోతులు ఉంటాయని చెప్పారు కొడాలి నాని. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా పాత రోడ్లు పోతుంటాయని, కొత్త రోడ్లు వేస్తున్నా, పాత రోడ్లపై గుంతలు పడుతుంటాయని చెప్పారు నాని. హైదరాబాద్ నగరంలో  కూడా రోడ్లపై గుంతలున్నాయని చెప్పారు నాని. జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట.. ఇలా చాలా ప్రాంతాల్లో రోడ్లపై గుంతలున్నాయని, పవన్ కల్యాణ్ కి అవి కనపడవా అని ప్రశ్నించారు. అంతెందుకు హైదరాబాద్ - విజయవాడ హైవేపై కూడా గోతులున్నాయని, వాటి గురించి పవన్ ఎందుకు మాట్లాడరంటూ నిలదీశారు నాని.
చంద్రబాబుకి తన భార్య విషయంలో చేసిన శపథం కంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడం ఎక్కువైందా అని ప్రశ్నించారు కొడాలి నాని. సీఎం అయ్యే వరకు అసెంబ్లీ గడప తొక్కను అని చెప్పిన చంద్రబాబు, రాష్ట్రపతి ఎన్నికల కోసం ఏ మొహం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చారని ప్రశ్నించారు. ఇక వరదలతో ప్రతిపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు నాని. గతంలో ఎవరూ చేయని విధంగా గోదావరి వరద బాధితుల్ని వైసీపీ ప్రభుత్వం ఆదుకుందని, బాధితులకు నిత్యావసరలాలతోపాటు 2 వేల రూపాయలు ఆర్థిక సాయం కూడా చేశామని చెప్పారు నాని. ఇకనైనా వరదలతో బురద రాజకీయం ఆపాలని ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. గతంలో వర్షాలు పడినప్పుడు కూడా ఇలాగే ప్రతిపక్షాలు విమర్శించాయని, ముందు ఏరియల్ సర్వే చేపట్టి, ఆ తర్వాత జగన్ నేరుగా బాధితుల్ని కలిశారని, ఇప్పుడు కూడా ఆయన నేరుగా బాధితుల్ని కలిసేందుకు వస్తారని చెప్పారు నాని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: