హైదరాబాద్ వాసులకు హై అలర్ట్..

Deekshitha Reddy
ఇటీవల కాలంలో హైదరాబాద్ వాసులను కరోన కేసులు ఇబ్బంది పెట్టాయి. ఆమధ్య భారీ వర్షాలకు కూడా హైదరాబాదీలు తెగ ఇబ్బంది పడిపోయారు. తాజాగా భాగ్యనగర వాసుల్ని విష జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. మారిన వాతావరణంతో గ్రేటర్ పరిధిలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నా పెద్దా అంతా.. జలుబు, దగ్గు, జ్వరం ఒంటి నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రులపాలవుతున్నారు. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోటు చల్లటి వాతావరణం కూడా ఈ అనారోగ్యాలకు కారణం అవుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు రోజులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
ఉస్మానియా ఆసుపత్రిలో రెండు రోజులుగా ఓపీ సంఖ్య బాగా పెరిగింది. దాదాపు ఓపీలే 2వేలు దాటుతున్నట్టు చెబుతున్నారు వైద్య శాఖ అధికారులు. నల్లకుంట ఫీవర్ ఆసుప్రతికి ప్రతి రోజూ 200నుంచి 300 మధ్యలో సాధారణ రోగులు వస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 500 దాటింది. కారణం వైరల్ ఫీవర్స్. ఇంట్లో ఒకరికి వైరల్ ఫీవర్ సోకితే.. వెంటనే మరొకరికి అది అంటుకుంటోంది. వైరల్ ఫీవర్ వచ్చిన రోగుల్లో 70 నుంచి 80 శాతం మంది ప్రధానంగా జలుబుతో బాధపడుతున్నారు. ముక్కు కారడం, ముక్కు బిగుసుకుపోవడం, గొంతు నొప్పి, తుమ్ములు.. కళ్లవెంట నీరు కారడం వంటి లక్షణాలతో అవస్థ పడుతున్నారు. ఒళ్లు నెప్పులు, జ్వరం వీటికి అదనం.
హైదరాబాద్ లో విష జ్వరాలు వణికిస్తుంటే.. ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దోమల వలన ఇప్పటికే తెలంగాణలోని 9 గిరిజన జిల్లాల్లో డెంగీ కేసులు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికీ ప‌లు జిల్లాల్లో శాంపిల్స్ సేకరణ కొనసాగిస్తున్నారు అధికారులు. తెలంగాణ రాష్ట్ర  వైద్యారోగ్యశాఖ రికార్డుల ప్రకారం కేసులు సంఖ్య తక్కువగా ఉన్నా కూడా.. ఆ లెక్కలను మించి డెంగీ కేసులు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఏజెన్సీ ఏరియాల్లో దాదాపు అన్ని గ్రామాలూ మంచం పట్టాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు అధికారులు.
వైరల్ ఫీవర్లు, డెంగీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. పరిసరాలలో నీటి నిల్వలు ఉంటే.. దోమలు వ్యాప్తి చెంది డెంగీ లాంటి వ్యాధులొస్తాయని, పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే.. ఈగల వలన అంటువ్యాధులు సోకే అవకాశం ఉందని, ప్ర‌జ‌లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఇప్పటికే హైదరాబాద్ లో వైరల్ ఫీవర్లు ఎక్కువయ్యాయి. మరిన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి విషమించే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: