చిరు-జగన్.. మరోసారి ఆకట్టుకున్నారు..

Deekshitha Reddy
అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల సందర్భంగా భీమవరంలో జరిగిన సభలో.. ఆసక్తికర సన్నివేశం కనిపించింది. చిరంజీవి, జగన్ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. వారిద్దరి ఆత్మీయ కలయికను చూసి జనం హర్షధ్వానాలు చేశారు. ముందుగా చిరంజీవి వేదికపైకి చేరుకోవడంతో.. భీమవరంలోని సభా ప్రాంగణంలో ఈలలు, చప్పట్లు వినిపించాయి. ఆ తర్వాత వేదికపైకి సీఎం జగన్ వచ్చారు. వైఎస్‌ జగన్‌ వస్తూ వస్తూనే చిరంజీవిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆప్యాయంగా ఆయనతో మాట్లాడారు. దీంతో సభా ప్రాంగణం అంతా మరోసారి చప్పట్లతో మారుమోగిపోయింది. ప్రజలంతా కరతాళ ధ్వానాలు చేశారు.
చిరంజీవి, జగన్ ఎప్పుడూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటారు. ఆమధ్య సినీ ఇండస్ట్రీ సమస్యలపై కూడా చిరంజీవి చొరవ తీసుకుని జగన్ ని వచ్చి కలిశారు. ఆ తర్వాత మిగతా హీరోలు, ఇండస్ట్రీ పెద్దలతో మరోసారి జగన్ ని కలసి వెళ్లారు. అప్పట్లో చిరంజీవి చొరవ వల్లే ఇండస్ట్రీ సమస్యలు పరిష్కారమయ్యాయని, టికెట్ రేట్ల పెంపు విషయంలో జగన్ సానుకూల నిర్ణయం తీసుకున్నారని అంటారు. అలా చిరంజీవి, జగన్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని తెలుస్తోంది.
అయితే పవన్ కల్యాణ్ పదే పదే జగన్ ని విమర్శించడం, ఇప్పుడు చిరంజీవి జగన్ ని ఆప్యాయంగా పలకరించడం రెండూ వేర్వేరుగా చూడాల్సిన సందర్భం. పవన్, జగన్ ఎదురెదురు పడితే ఆ సన్నివేశం ఎలా ఉంటుందో చెప్పలేం. ఒకరినొకరు పలకరించుకుంటారా, ఆలింగనం చేసుకుంటారా, కనీసం షేక్ హ్యాండ్ అయినా ఇచ్చుకుంటారా అనేది ఊహించలేం. అయిచే చిరంజీవి మాత్రం ఎక్కడా ఎలాంటి భేషజాలకు పోకుండా ఆప్యాయంగా జగన్ ని ఆలింగనం చేసుకున్నారు. జగన్ కూడా చిరుకి అంతే గౌరవం ఇచ్చారు. మరి వీరిద్దరి కలయికను జనసైనికులు ఎలా అర్థం చేసుకుంటారో చూడాల్సి ఉంది.
గతంలో ఓసారి చిరంజీవికి వైసీపీ తరపున రాజ్యసభ టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ జగన్ ఆ పని చేయలేదు. చిరు కూడా ఆ గౌరవం ఆశించలేదు. తాను పూర్తిగా రాజకీయాలకు దూరం అన్నారు, దూరంగానే ఉన్నారు. కానీ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో రాణిస్తే చూడాలని మాత్రం చిరంజీవి అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: